ఇరాన్‌పై వీగిన అమెరికా తీర్మానం

16 Aug, 2020 03:00 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతా మండలిలో వీగిపోయింది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్‌ రిపబ్లిక్‌ నుంచి మాత్రమే మద్దతు లభించింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది.

అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, తమ వీటో పవర్‌ని ఉపయోగించే అవసరం ఆ దేశాలకు రాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. 2015లో ఇరాన్‌కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్‌ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్‌ ప్రభుత్వం వైదొలిగింది.

మరిన్ని వార్తలు