వర్క్‌పర్మిట్లపై యూఎస్‌ కీలక నిర్ణయం

5 May, 2022 06:18 IST|Sakshi

వాషింగ్టన్‌: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్‌1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్‌ కేటగిరీలకు చెందినవారి వర్క్‌ పర్మిట్‌ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్‌ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ తెలిపింది.

పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్‌సీఐఎస్‌ (అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల శాఖ) డైరెక్టర్‌ జడోయ్‌ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్‌ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్‌ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్‌ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్‌ సంఘాలు స్వాగతించాయి.

మరిన్ని వార్తలు