-

ఆ ఉగ్రవాదిని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం

28 Nov, 2020 13:15 IST|Sakshi

వాషింగ్టన్‌ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్‌ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడుల‌కు పాల్ప‌డడంలో కీలకంగా వ్యవహరించిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది సాజిద్ మిర్‌పై భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ముంబై దాడుల్లో కీల‌క పాత్ర పోషించిన సాజిద్ మిర్ స‌మాచారం ఇచ్చినా లేక ప‌ట్టిచ్చిన వారికి 5 ల‌క్ష‌ల అమెరికన్ మిలియన్‌‌ డాల‌ర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వ‌నున్న‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ పేర్కొన్న‌ది. 

అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ ప్రోగ్రామ్‌ సందర్భంగా సాజిద్‌ మిర్‌ స‌మాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముంబై దాడుల‌కు ల‌ష్క‌రే ఆప‌రేష‌న్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్‌, ప్రిప‌రేష‌న్‌, ఎగ్జిక్యూష‌న్ సాజిద్‌ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. 

కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు.
 

మరిన్ని వార్తలు