డిసెంబరు నాటికి వ్యాక్సిన్; ప్లాస్మా చికిత్సకు గ్రీన్‌ సిగ్నల్‌!

24 Aug, 2020 12:05 IST|Sakshi

భారత్‌లో ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్‌!

ప్లాస్మా థెరపీకి అమెరికా గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్‌-19 నిరోధక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. దేశీయంగా మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నారని.. ప్రస్తుతం ఇవి క్లినికల్‌ ప్రయోగాల దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీటర్‌లో పేర్కొన్నారు. కాగా కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగి పోతున్న తరుణంలో ప్రపంచమంతా కోవిడ్‌ టీకా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. (ఒక్కరోజే 61 వేల కేసులు‌, 836 మరణాలు)

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేసిన కోవ్యాక్సిన్‌, ఆక్స్‌ఫర్ట్‌తో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌, జైడుస్‌ కాడిలా జైకోవ్‌ డీ ఇప్పటికే మానవ ప్రయోగాల్లో వివిధ దశలను పూర్తి చేసుకోవడంతో వ్యాక్సిన్‌ రాకపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఆక్స్‌ఫర్ట్‌ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు పూర్తికాగా.. మిగిలిన రెండు రెండో దశలోకి ప్రవేశించినట్లు భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు, ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగల గురించిన సమాచారాన్ని తెలియజేయుటకై భారత ఐసీఎంఆర్‌ ఓ ఆన్‌లైన్‌ వ్యాక్సిన్‌ పోర్టల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఎపిడిమాలజి, కమ్యూనల్‌ డిసీజెస్‌ హెడ్‌ సమీరన్‌ పాండా తెలిపారు.   

ప్లాస్మా చికిత్సకు అనుమతి
ఇదిలా ఉండగా.. కోవిడ్‌ పేషెంట్ల పట్ల వరప్రదాయినిగా మారిన ప్లాస్మా థెరపీకి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆదివారం అనుమతులు జారీ చేసింది. కరోనా ఎదుర్కోవడంలో ఇదెంతగానో దోహదపడుతుందని భావిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్‌లో పెద్ద ఎత్తున ప్లాస్మా థెరపీకి ప్రచారం లభించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గణాంకాలపై వైద్య నిపుణుల సందేహాలు లేవనెత్తగా ఈ చికిత్సా విధానంపై తొలుత ఎఫ్‌డీఏ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీలైనంత త్వరగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చేలా తన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. తద్వారా కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో తన పాలనా యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్న డెమొక్రాట్లకు దీటుగా జవాబివ్వవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు