ఆకలి కేకల పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అవసరమా?.. అమెరికా ఏం చేయాలనుకుంటోంది?

24 Sep, 2022 17:29 IST|Sakshi

పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది? కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్ఠి వానలు పడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తి కోట్లాది మందిని నిరాశ్రయులను చేసేశాయి. ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక పాక్ పాలకులు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతటి విపత్తు వేళ పాకిస్థాన్ ప్రజల ఆకలి తీర్చడానికి.. అందుకోసం పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఇతర ఉత్పత్తులు అందించడానికి భారత ప్రభుత్వం సంసిద్ధమైపోయింది. పాక్ ప్రభుత్వం అడిగితే చాలు మరుక్షణమే వాటిని అందించి పాక్‌ను ఆదుకోవాలని భారత ప్రభుత్వం సమాయత్తమైపోయింది.

ఇపుడు ప్రపంచంలోని ఏ దేశమైనా సరే పాకిస్థాన్‌ను ఆదుకోవాలంటే ఏం చేయాలి? వీలైనంతగా ఆహార ఉత్పత్తులను అందించి అక్కడి ప్రజల కడుపులు నింపాలి. ఇంతటి భీకరమైన పరిస్థితులు నెలకొన్న ఉన్న వేళ అగ్రరాజ్యం అమెరికా ఏం చేసిందో తెలుసా? పాకిస్థాన్ కు 450 మిలియన్ డాలర్ల విలువ చేసే  యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఆకలి కేకల పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అవసరమా? ఆహార ధాన్యాల బస్తాలు అవసరమా? అన్నది  ఆరేళ్ల కుర్రాడినడిగినా చెప్తాడు. కానీ అమెరికాకి మాత్రం పాకిస్థాన్‌ను మరోలా ఆదుకోవాలని అనిపించింది . అందుకే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇంతకీ ఏంటీ ప్రాజెక్ట్? అమెరికా ఏం చెబుతోందంటే పాకిస్థాన్‌కు తాము గతంలో సరఫరా చేసిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఆధునికీకరించడానికి అవసరమైన స్పేర్ పార్టులను అందించడంతో పాటు ఆధునికీకరించే పరిజ్ఞానాన్ని అందిస్తున్నామని చెబుతోంది. అది కూడా గతంలో తాము విక్రయించిన యుద్ధ విమానాలు జీవితకాలం పాటు పనిచేసేలా వాటికి సర్వీసింగ్ చేస్తున్నాం అంతే అని చెప్పుకొస్తోంది.

ఇంతకు మించిన జోక్ మరోటి ఉంటుందా? ప్రపంచానికి ఉగ్రవాదులను ఎగుమతి చేస్తూ.. యావత్ భూగోళాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టేస్తూ ఉగ్రహింసను విశ్వవ్యాప్తం చేసే అజెండాతో పాకిస్థాన్ తమ దేశాన్నే ఓ ఉగ్రకర్మాగారంగా మార్చేసిందని ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ విషయం అమెరికాకి తెలీదా? ఇపుడు పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలను నెక్ట్స్‌ లెవెల్‌కి అప్ గ్రేడ్ చేసి ఇస్తే వాటిని పాకిస్థాన్ ఎవరిపై ప్రయోగిస్తుంది? సింపుల్.. భారత్ పైనే కదా. ఇది అమెరికాకి తెలీకుండా ఉంటుందా? 

ఈ వ్యాపారం అమెరికాకి కొత్తకాదు. అమెరికా చరిత్ర అంతా ఆయుధాల అమ్మకాలతోనే ముందుకు నడిచింది. యుద్ధాలు తేవడం ఆ తర్వాత ఆయుధాలు అమ్ముకోవడం.. ఇదీ అమెరికా శైలి. 1980లకి ముందు అమెరికా పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలు అమ్మింది. అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్‌ను తన గుప్పెట్లో పెట్టుకున్న సోవియట్ యూనియన్‌ను దెబ్బతీయడం కోసం పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలు సరఫరా చేసింది. వీరి సాయంతోనే పాకిస్థాన్ ముజాహిదీన్లను చేరదీసి వారిని ఉగ్రవాదులుగా మార్చి పెంచి పోషించింది. సెప్టెంబరు 11 దాడుల తర్వాత  అల్ కాయిదాపై యుద్ధానికి అమెరికా కాలుదువ్విన వేళ మళ్లీ పాకిస్థాన్‌కు ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసింది అమెరికా.

ఆఫ్ఘనిస్థాన్‌లో  20 ఏళ్ల పాటు మకాం వేసిన అమెరికా ప్రజాప్రభుత్వాన్ని స్థాపించినా తాలిబాన్‌ను మాత్రం ఏమీ చేయకుండా వదిలేసింది. చివరకు గత ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ ప్రజల మాన ప్రాణాలను తాలిబాన్ చేతుల్లో పెట్టేసి తమ సేనలను ఆఫ్ఘన్ నుండి వెనక్కి రప్పించేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ కూడా తాలిబాన్‌తో చేతులు కలిపింది. పాకిస్థాన్, తాలిబాన్ కలిస్తే ఆసియాలో మరింత అగ్గి రాజుకోవడం ఖాయమని మేధావులు ఆందోళన చెందుతున్నారు కూడా. సరిగ్గా ఈ తరుణంలోనే ఇపుడు అమెరికా మరోసారి పాకిస్థాన్‌తో ఎఫ్-16 యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు