ఆర్మీ: నెయిల్‌ పాలిష్‌, పోనిటెయిల్‌కు ఓకే

28 Jan, 2021 16:10 IST|Sakshi

మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కీలక మార్పులు చేసిన అమెరికా

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌.. అగ్రరాజ్య సైన్యానికి సంబంధించి పలు కీలక మార్పులకు ఆమోదం తెలిపారు. సైన్యంలో మహిళా సైనికుల వస్త్రధారణకు సంబంధించి కొన్ని నియమాల్లో కీలక మార్పులు చేశారు. ఇక మీదట అమెరికన్‌ సైన్యంలోని మహిళా సైనికులు షార్ట్‌ పోనిటెయిల్‌ వేసుకోవడానికి.. లిప్‌స్టిక్‌ పెట్టుకోవడానికి అనుమతించారు. అలానే మగ సైనికులు స్పష్టమైన రంగుల నెయిల్‌ పాలిష్‌ ధరించవచ్చని తెలిపారు. ఇక బిడ్డకు పాలిచ్చే మహిళా సైనికులు వస్త్రధారణకు సంబంధించి పలు సడలింపులు ఇచ్చారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌, పంపింగ్‌ ద్వారా బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రస్తుత వస్త్రధారణ ప్రమాణాలకు అదనంగా లోపల మరో వస్త్రం ధరించేందుకు అనుమతిచ్చారు. ఈ నూతన మార్పులు ఫిబ్రవరి 25 నుంచి అమల్లోకి రానున్నాయి అని తెలిపారు. ప్రస్తుత మార్పులు అమెరికా సైన్యంలో చేరే మహిళల సంఖ్యను పెంచుతాయని.. అంతేకాక ప్రస్తుతం ఉన్న మహిళా సైనికులపై అసమాన ప్రభావాన్ని చూపుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: బైడెన్‌ వలస చట్టంపై హోరాహోరీ )

మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ సూచనల ఫలితమే ఈ మార్పులు. ఈ కమిటీ మిలటరీలో జాతివివక్ష, మైనారిటీలపై అధికార దుర్వినియోగం వంటి పలు అంశాల పరిశీలనకు ఉద్దేశించబడింది. గతంలో అమెరికా సైన్యంలోని మహిళలు పొడవాటి జుట్టును బన్‌(కొప్పు)లా కట్టుకోవాల్సి వచ్చేది. ఇది అసౌకర్యంగా ఉండటమే కాక.. హెల్మెట్‌ ధరించడంలో ఇబ్బంది కలిగేది. ఇక తాజా సవరణలతో ఈ సమస్యలు తొలగిపోనున్నాయి. ఈ సందర్భంగా ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గ్యారీ బిట్రో మాట్లాడుతూ.. ‘‘మా విధానాలను నిరంతరం పరిశీలించుకుంటూ.. అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నాం. ఇక మేం అవలించే విధానాల వల్ల సైన్యంలోని సైనికులందరు మాకు ఎంత విలువైన వారో.. వారి పట్ల మాకు ఎంత నిబద్ధత ఉందో వెల్లడవుతుంది. మా ర్యాంకుల్లో చేరిక, ఈక్విటీ వంటి అంశాల్లో.. మాటల కంటే చేతలు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఈ రోజు మేం మరోసారి నిరూపించాం. మేం ప్రకటించిన ఈ మార్పులు మన ప్రజలను మొదటి స్థానంలో ఉంచే విధానాలకు ఒక ఉదాహరణ అని మేం నమ్ముతున్నాం’’ అన్నారు. 
(చదవండి: అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్)

ఇక ఆర్మీలో చేసిన ఈ మార్పులు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మగ వారికి నెయిల్‌ పాలిషా.. వ్వాటే జోక్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక అమెరికా వాయు సేన తన విభాగంలో పని చేస్తున్న మహిళా సైనికుల హెయిర్‌ స్టైల్‌ విషయంలో పలు మార్పులు చేసిన వారం రోజుల తర్వాత మిలిటరీ ఈ నూతన మార్పులు ప్రకటించింది. ఇక ఇదే కాక బైడెన్‌ లింగమార్పిడి వ్యక్తులను సైన్యంలోకి నిషేధిస్తూ.. ట్రంప్‌ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అంతేకాక ‘‘దేశానికి సేవ చేయాలనుకునే వారిని ప్రోత్సాహిస్తేనే.. అమెరికా సురక్షితంగా ఉంటుంది. అలాంటి వారి విషయంలో వివక్ష చూపకూడదని.. వారి పట్ల గర్వంగా భావించాలి’’ అని బైడెన్‌ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు