అమెరికా సైన్యం షాకింగ్ నిర్ణయం.. చినూక్ హెలికాప్టర్లు నిలిపివేత.. ఆందోళనతో భారత్ లేఖ

31 Aug, 2022 12:34 IST|Sakshi

వాషింగ్టన్‌: చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా సైన్యం.  ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదముందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క చినూక్ హెలికాప్టర్‌ కూడా నింగిలోకి ఎగరకుండా నేలకే పరిమితమయ్యాయి.

అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది.

70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్‌లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీ మెటిరీయల్ కమాండ్‌ సూచించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీటి సేవలను నిలిపివేశారు అధికారులు. గతంలో పలుమార్లు ఈ హెలికాప్టర్ ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్‌ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంతో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై కూడా స్పష్టత లేదు.
చదవండి: ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన సోవియట్ యూనియన్ నేత మృతి

మరిన్ని వార్తలు