ఇరాన్‌పై ఆంక్షల్ని పునరుద్ధరించిన అమెరికా

21 Sep, 2020 04:57 IST|Sakshi

ట్రంప్‌ ప్రభుత్వానికి ఆ హక్కు లేదని మండిపడుతున్న ప్రపంచ దేశాలు

వాషింగ్టన్‌: ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్టుగా అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. వచ్చేవారంలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సమావేశంలో చట్ట విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయంపై గళమెత్తడానికి సిద్ధమవుతున్నాయి. 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ)లో నిబంధనల్ని ఆ దేశం ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపించింది. భద్రతా మండలి చట్టాల ప్రకారం ఇరాన్‌ చేస్తున్న పనులు సరైనవి కావంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇరాన్‌కు నోటీసులు పంపారు.

ఆ నోటీసుల గడువు నెల పూర్తి కాగానే ఆంక్షల్ని విధిస్తున్నట్టుగా ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనల్ని పాటించడంలో ఇరాన్, ఆంక్షల్ని తిరిగి విధించడంలో భద్రతా మండలి విఫలమైనందునే  ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాంపియో అంటున్నారు. మరోవైపు, ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షల్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం వైట్‌ హౌస్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఆయుధాల నిషేధం సహా అన్ని రకాల ఆంక్షల్ని పునరుద్ధరించామని, యూఎన్‌ సభ్యదేశంగా తమకి ఆ హక్కు ఉందని అమెరికా అంటోంది. ఇలా ఉండగా, 2018లో అమెరికా అణు ఒప్పందం నుంచి ఎప్పుడైతే వైదొలిగిందో అప్పుడే ఆ దేశంపై ఆంక్షలు విధించే హక్కు కోల్పోయిందని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ అంటున్నాయి. అమెరికా నిర్ణయాలను చైనా, రష్యా ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్నాయి.

మరిన్ని వార్తలు