అమెరికా–చైనా మాటల యుద్ధం

20 Mar, 2021 04:14 IST|Sakshi

బహిరంగంగానే దుమ్మెత్తి పోసుకున్న ఇరు దేశాల అధికారులు

బైడెన్‌ అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా సంభాషణలు

వాషింగ్టన్‌: అమెరికా–చైనాల మధ్య విభేదాలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. అధ్యక్షుడిగా జో బైడెన్‌ పగ్గాలు చేపట్టాక అమెరికాలోని అలాస్కాలో రెండు దేశాల మధ్య జరిగిన మొట్టమొదటి భేటీ ఇందుకు వేదికగా మారింది. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా ఆరోపించగా, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామని చైనా బదులిచ్చింది. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్, చైనా నుంచి విదేశాంగ శాఖ ఉన్నతాధికారి యాంగ్‌ జీయిచి, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ చర్చల్లో పాల్గొన్నారు.

చర్చలకు ముందు  అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చర్చల్లో తాము ప్రస్తావించబోయే అంశాలు రెండు దేశాలతోపాటు, ప్రపంచానికే కీలకమైనవని అన్నారు. ‘జిన్‌జియాంగ్, తైవాన్, హాంకాంగ్‌లలో చైనా ప్రభుత్వ చర్యలపై మా ఆందోళనను ఈ చర్చల్లో ప్రస్తావిస్తాం. అలాగే, అమెరికాపై సైబర్‌ దాడులపైనా చర్చిస్తాం’ అని చెప్పారు. చైనా చర్యలు నిబంధనల ఆధారంగా కొనసాగుతున్న ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయి. ఇవి అంతర్గత వ్యవహారాలు అనుకునేందుకు వీలు లేదు కాబట్టే, మేం వీటిని చర్చల్లో లేవనెత్తాలని భావిస్తున్నాం’ అని బ్లింకెన్‌ చెప్పారు. దీనిపై చైనా విదేశీవ్యవహారాల శాఖ ఉన్నతాధికారి యాంగ్‌ జీయిచి  స్పందించారు.  ఐక్యరాజ్యసమితి ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను, అంతర్జాతీయ చట్టాలను మాత్రమే అనుసరిస్తామే తప్ప, కేవలం కొన్ని దేశాలు మాత్రమే వాదించే నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమతను అనుసరించబోమని తెలిపారు.   తమ అంతరంగిక వ్యవహారాల్లో అమెరికా తలదూర్చడాన్ని గతంలో మాదిరిగానే ఇకపైనా గట్టిగా వ్యతిరేకిస్తామన్నారు.

మరిన్ని వార్తలు