మేం మోసపోయాం.. నిత్యానంద కైలాసకు బిగ్‌ షాక్‌

5 Mar, 2023 10:55 IST|Sakshi

వాషింగ్టన్‌: కల్పిత దేశం యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్‌ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే  కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. 

అమెరికన్‌ సిటీ నెవార్క్.. కైలాసతో​ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్‌ గారోఫాలో స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్‌సైట్‌ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత  పత్రాలను  పోస్ట్‌ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. 

జనవరి 12వ తేదీన నెవార్క్‌ సిటీ హాల్‌లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్‌ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. 

అత్యాచారం, కిడ్నాప్‌ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్‌లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్‌ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. 

అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్‌ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్‌ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్‌ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరిన్ని వార్తలు