డ్రోన్ దాడిలో అల్ ఖైదా కీలక నేత హతం: అమెరికా

23 Oct, 2021 12:20 IST|Sakshi

డమస్కస్‌: సిరియాలో అమెరికా జరిపిన దాడుల్లో అల్ ఖైదా అగ్రనేత హతమయ్యాడు. నార్త్‌ వెస్ట్రన్‌ సిరియాలోని స్థావరంపై అమెరికా డ్రోన్‌ల సాయంతో ఈ దాడులు చేపట్టింది. ఈ దాడిలో అల్-ఖైదా సీనియర్ నాయకుడు, అబ్దుల్ హమీద్ అల్ మాతర్ మరణించినట్లు సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడిలో సాధారణ పౌరులు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఎమ్‌క్యూ-9 విమానం ఉపయోగించి దీనిని నిర్వహించామని ఆయన చెప్పారు. తాజాగా జరిపిన దాడిలో అల్‌ఖైదాలోని కీలక నేతను హతమార్చడంతో ఉగ్రవాద సంస్థలు ప్రపంచంపై జరిపే దాడులను నివారిస్తుందని ఆయన అన్నారు.  సెప్టంబర్‌ చివరిలో అల్ ఖైదా నేత అబు అహ్మద్ యూఎస్‌ సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అబు అహ్మద్‌ నిధుల సమీకరణ, దాడులకు ప్రణాళికలు రచించడం, ఎక్కడికక్కడ అల్ ఖైదా దాడులకు అనుమతులు ఇవ్వడం తదితర బాధ్యతలను నిర్వర్తించేవాడు. దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడిచేసిన రెండు రోజుల తర్వాత ఈ డ్రోన్‌ దాడి జరగడం విశేషం. అయితే ప్రతికారంగానే ఈ దాడి జరిగిందా అనే విషయాన్ని అమెరికా ధృవీకరించలేదు.

చదవండి: Russia Orders: ఆ వారం రోజులు ఆఫీసులకు వెళ్లకండి.. అయినా జీతాలిస్తాం!

మరిన్ని వార్తలు