బైడెన్‌కు కాంగ్రెస్‌ ఆమోదం

8 Jan, 2021 04:25 IST|Sakshi

ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్‌

జనవరి 20న ప్రమాణ స్వీకారం

అధికార మార్పిడి సజావుగా సాగుతుందన్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి నేత కమల హారిస్‌ ఎన్నికకు గురువారం అధికారికంగా కాంగ్రెస్‌ ఆమోద ముద్ర లభించింది. క్యాపిటల్‌ బిల్డింగ్‌లో ప్రస్తుత అధ్యక్షుడు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల అసాధారణ హింసాత్మక విధ్వంసం అనంతరం.. అమెరికా పార్లమెంటు ఉభయ సభలు ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఓట్లను ఆమోదించడం ద్వారా ఆ ఇరువురు డెమొక్రటిక్‌ నేతల ఎన్నికను నిర్ధారించాయి.

పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలపై రిపబ్లికన్‌ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను ప్రతినిధుల సభ, సెనెట్‌ తోసిపుచ్చాయి. బైడెన్, కమల 306 ఎలక్టోరల్‌ సీట్లను, ట్రంప్, రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి పెన్స్‌ 232 ఎలక్టోరల్‌ సీట్లను సాధించినట్లు నిర్ధారించాయి. 78 ఏళ్ల బైడెన్‌ జనవరి 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్‌ హిల్‌లో బుధవారం జరిగిన హింసాకాండలో ఒక మహిళ సహా నలుగురు చనిపోయారు. ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ మహిళ మరణించారు.

పదుల సంఖ్యలో ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆందో ళనకారులను చెదరగొట్టిన తరువాత సమావేశాలు మళ్లీ కొనసాగాయి. గురువారం తెల్లవారు జాము వరకు సాగిన సమావేశంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను, కౌంటింగ్‌ను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆరిజోనా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్‌ సభ్యుల అభ్యంతరాలను సెనెట్‌ 93–6 ఓట్లతో, ప్రతినిధుల సభ 303–121 ఓట్లతో తోసిపుచ్చాయి. పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితంపై రిపబ్లికన్‌ సభ్యుల అభ్యంతరాలను సెనెట్‌ 92–7 ఓట్లతో, ప్రతినిధుల సభ 282–138 ఓట్లతో తోసిపుచ్చాయి. భారత సంతతి ఎంపీలు రో ఖన్నా అమీ బెరా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్‌ కూడా ఆయా అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఓటేశారు.  

ఓటమి ఒప్పుకున్న ట్రంప్‌
బైడెన్, కమల ఎన్నికకు కాంగ్రెస్‌ ఆమోద ముద్ర లభించిన అనంతరం.. డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక అధికారిక ప్రకటనలో ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించనప్పటికీ.. జనవరి 20న అధికార మార్పిడి సజావుగా సాగుతుందని స్పష్టం చేశారు. అత్యద్భుతమైన తన తొలి టర్మ్‌ అధ్యక్ష పాలనకు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పోలైన వాటిలో న్యాయమైన ఓట్లనే లెక్కించాలన్న డిమాండ్‌పై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఫలితాలపై కుట్రపూరిత వాదనలను పోస్ట్‌ చేస్తుండటంతో ట్రంప్‌ అకౌంట్లను ఫేస్‌బుక్‌ 24 గంటల పాటు, ట్విటర్‌ 12 గంటల పాటు నిలిపివేశాయి. మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన ప్రసంగం సహా మూడు ట్వీట్లను బ్లాక్‌ చేసింది. ప్రమాణస్వీకారం చేసేంత వరకు ట్రంప్‌ను బ్లాక్‌ చేయాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ట్రంప్‌ ఫేస్‌బుక్‌ను వాడేందుకు అనుమతించడం ప్రమాదకరమని సంస్థ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌ అన్నారు. ట్రంప్‌ అకౌంట్‌ను 2వారాలు బ్లాక్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు