ట్రంప్‌ని గడువుకు ముందే తప్పిస్తారా?

8 Jan, 2021 04:31 IST|Sakshi

రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా తప్పించాలని కాంగ్రెస్‌ యోచన  

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని గడువుకి ముందే గద్దె దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీనికి గల మార్గాలను అన్వేషిస్తోంది.  ట్రంప్‌ని ఎలాగైనా తప్పించాలని సభ్యుల్లో చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ ఈలోగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ అధికరణం ద్వారా ట్రంప్‌ని తొలగించడానికి గల అవకాశాలను కాంగ్రెస్‌ సభ్యులు పరిశీలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది అభిశంసన తీర్మానం కాగా, రెండోది 25వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన అధికరణం. దేశ ఉపాధ్యక్షుడు, మంత్రి మండలి సభ్యులు కలిసి ఈ అధికరణాన్ని ప్రయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించవచ్చు. ఆ తర్వాత ఉపాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.  

ఏమిటీ సవరణ?  
రాజ్యాంగంలోని 25వ సవరణలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. అమెరికా అ«ధ్యక్షుడు పదవిలో ఉండగానే మరణిస్తే దీనిలో మొదటి సెక్షన్‌ ద్వారా ఉపాధ్యక్షుడు పదవి బాధ్యతలు చేపడతారు. రెండో సెక్షన్‌ ఉపాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేయడానికి సంబంధించినది కాగా, మూడోది అధ్యక్షుడెవరైనా తనంతట తానుగా పదవిలో కొనసాగలేనని, తప్పుకుంటానని చెప్పినప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించడానికి వినియోగిస్తారు. ఇక అధ్యక్షుడు పాలనా వ్యవస్థపై నియంత్రణ కోల్పోతే ఉపాధ్యక్షుడు, కేబినెట్‌ సభ్యుల ఆమోదంతో నాలుగో సెక్షన్‌ ద్వారా అధ్యక్షుడిని తొలగించవచ్చు.

అభిశంసన చేయొచ్చా?
ట్రంప్‌ని అభిశంసన ద్వారా కూడా పదవి నుంచి తొలగించవచ్చు. అయితే ఇది ప్రతినిధుల సభ ద్వారా జరగాలి. మూడింట రెండు వంతుల మెజార్టీతో ప్రతినిధుల సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఒకే రోజులో ఈ ప్రక్రియని ముగించేలా వెసులుబాటు ఉంది. గత ఏడాది ట్రంప్‌పై అభిసంశన తీర్మానం పెట్టినా సెనేట్‌లో వీగిపోయింది.  

మరిన్ని వార్తలు