భారత్‌తో 'యుద్ధ్ అభ్యాస్'.. డ్రాగన్‌కు ఈగల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

2 Dec, 2022 18:30 IST|Sakshi

వాషింగ్టన్‌: డ్రాగన్‌ కంట్రీ చైనాకు మరో స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. ఉత్తరాఖండ్‌లో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి భారత్‌ ఘాటైన కౌంటర్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో చైనాకు మరో పంచ్‌ పడింది. 

ఈ వ్యవహారంలో తాము భారత్‌ వెంటే నిలుస్తామని అమెరికా ప్రకటించింది. భారత్‌ చెప్పిన దానితో ఏకీభవిస్తూ..  ఇది చైనా ఏమాత్రం సంబంధం లేని విషయం..  అని అమెరికా వ్యవహారాల ప్రతినిధి ఎలిజబెత్‌ జోన్స్‌ ఇవాళ ఒక ప్రకటన చేశారు. శుక్రవారం జర్నలిస్టులతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు.

చైనా సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలోని ఔలి దగ్గర.. భారత్‌-అమెరికా దళాలు సంయుక్తంగా యుద్ధ్‌ అభ్యాస్‌ పేరుతో విన్యాసాలు చేపట్టాయి. ఇది ఇరు దేశాల ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంటూ భారత్‌ను ఉద్దేశించి చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే గురువారం చైనాకు భారత్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 

విదేశాంగ శాఖ స్పందిస్తూ..  భారత్‌ ఎవరితో సైనిక విన్యాసాలు నిర్వహించుకోవాలన్నది సొంత నిర్ణయమని, ఈ వ్యవహారంలో మూడో దేశానికి సర్వాధికారమేమీ కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఇక విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ స్పందిస్తూ.. చైనాతో 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలకు.. ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపారు. 

యుద్ధ్‌ అభ్యాస్‌ పేరుతో భారత్‌-అమెరికా బలగాలు.. 18వ సంయుక్త సైన్య విన్యాసాలు చేపట్టాయి. వాస్తవ నియంత్రణ రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో.. ఉత్తరాఖండ్‌ ఔలి దగ్గర ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: అందుకు అమెరికా ఒప్పుకుంటే చర్చలకు రెడీ! 

మరిన్ని వార్తలు