ముందు అమెరికా.. ఆ తర్వాతే ఎవరికైనా!

24 Apr, 2021 02:20 IST|Sakshi

అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రిన్స్‌

వాషింగ్టన్‌: భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించడాన్ని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రిన్స్‌ సమర్ధించుకున్నారు. అమెరికా ప్రజల బాధ్యతలను పట్టించుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయాలని తమ ప్రభుత్వం భారీ కార్యాన్ని ప్రారంభించిందని, అది విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ఎగుమతులపై నిషేధం విధించేందుకు తమకు రెండు ప్రత్యేక కారణాలున్నాయని చెప్పారు. మొదటగా అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయడం తమ బాధ్యత అన్నారు. రెండవదిగా ప్రపంచంలోని ఏ ఇతర దేశంతో పోల్చినా అమెరికా అత్యంత ఎక్కువగా కోవిడ్‌ బారిన పడిందని తెలిపారు. 5,50,000 వేలకు పైగా మరణాలు సంభవించడం అందుకు గుర్తు అని వ్యాఖ్యానించారు. 

అమెరికా ఆసక్తే కాదు..
అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్‌ చేయాలన్న ఆసక్తి కేవలం అమెరికన్లది మాత్రమే కాదని, ప్రపంచమంతా కోరుకుంటోందని నెడ్‌ ప్రిన్స్‌ అభిప్రాయపడ్డారు. వైరస్‌ ఏదో ఒక చోట ఉన్నంత కాలం అది సరిహద్దులు దాటి విస్తరిస్తూనే ఉంటుందని చెప్పారు. మ్యుటేట్‌ చెందుతూ దేశదేశాలకు వ్యాపిస్తుందని అన్నారు. అందువల్ల తాము మొదటి లక్ష్యమైన అమెరికన్ల బాగోగుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు గతంలో ట్రంప్‌ కూడా డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం కారణంగా అమెరికాకు చెందిన కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మొదటగా అమెరికా అవసరాలు తీర్చాల్సి ఉంటుందని అన్నారు. దీని కారణంగా ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఉంటోందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు