కోవిడ్‌-19 : వ్యాక్సిన్‌ కోసం భారీ నిధులు

27 Jul, 2020 09:45 IST|Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిరోధించేందుకు పలు దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరీక్షలు కీలక దశకు చేరాయి.  వచ్చే ఏడాది ఆరంభంలోనే కోట్లాది అమెరికన్లకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు అగ్రరాజ్యం భారీ కసరత్తు చేపట్టింది. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు భారీగా నిధులు సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. మానవులపై వ్యాక్సిన్‌ తుది దశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవడంతో 7500 కోట్ల రూపాయల వరకూ ఈ వ్యాక్సిన్‌పై అమెరికా ప్రభుత్వం వెచ్చించనుందని మోడెర్నా బయాటెక్నాలజీ కంపెనీ వెల్లడించింది. దీంతో రెండు విడతలుగా ఈ వ్యాక్సిన్‌కు అమెరికా 7500 కోట్ల రూపాయలు సమకూర్చినట్లయింది. చదవండి : దేశంలో వ్యాక్సిన్‌ పరీక్షల జోరు

గతంలో 483 మిలియన్‌ డాలర్ల నిధులను ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఆ నిధులను రెట్టింపు చేయడంతో మొత్తం పెట్టుబడులు రూ 7500 కోట్లకు చేరాయి. తమ వ్యాక్సిన్‌ మూడవ దశ పరీక్షలను ప్రభుత్వంతో కలిసి 30,000 మంది వాలంటీర్లపై నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో అదనపు నిధులు ఉపకరిస్తాయని మోడెర్నా తెలిపింది. గతంలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో మోడెర్నా వ్యాక్సిన్‌ వాలంటీర్లలో కరోనా వైరస్‌ యాంటీబాడీలను ప్రేరేపించినట్టు వెల్లడైంది. వారిలో ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినట్టు తేలింది. ఇక సోమవారం నుంచి ప్రారంభమైన తుది దశ పరీక్షలో పాల్గొనే 30,000 మందిలో 15,000 మందికి వ్యాక్సిన్‌ 100 మెక్రోగ్రామ్‌ డోస్‌ ఇవ్వనుండగా, మిగిలిన వారికి ప్లాసెబో ఇస్తారు. కోవిడ్‌-19తో అమెరికా తీవ్రంగా ప్రభావితమవడంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాలో ఇప్పటికే 1,46,000 కోవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు