Weight Loss Medicine: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు

5 Nov, 2021 19:51 IST|Sakshi

వినియోగంలోకి తీసుకువచ్చిన అమెరికా నోవో నార్డిస్‌ కంపెనీ

తొలిసారి బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం

వాషింగ్టన్‌: అదేంటో వరుసగా రెండు రోజులు బాగా తింటే లావవుతాం.. ఇక వరుసగా నెలరోజులు వ్యాయామం చేస్తే తప్ప పెరిగిన బరువు తగ్గించుకోలేం. ఇక ప్రతి రోజు వ్యాయామం చేయడం అందరికి వీలు కాదు. కుదిరినా బద్దకం వల్ల దాని గురించి పెద్దగా పట్టించుకోం. అందుకే మార్కెట్‌లో వ్యాయమంతో పని లేకుండా బరువు తగ్గించే ట్రిక్కులకు, మందులకు డిమాండ్‌ అధికం. కానీ వీటి వల్ల దుష్పరిణామాలు తలెత్తుతాయని హెచ్చరిస్తుంటారు నిపుణులు. ఈ క్రమంలో అమెరికాలో తొలిసారి బరువు తగ్గించే ఔషధానికి అనుమతి లభించింది. దాంతో ఆ మెడిసిన్‌ కోసం అమెరికా వాసులు మెడికల్‌ షాపులకు పరుగు తీస్తున్నారు. 

ఆ వివరాలు.. బరువు తగ్గించేందుకుగాను నోవో నోర్డిస్క్‌ అనే ఫార్మ కంపెనీ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు అమెరికాలో భారీ ఆదరణ లభిస్తోంది. అయితే, గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతున్నారు. ఈ మెడిసిన్‌ వినియోగానికి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ మెడిసిన్‌కి అనుమతి లభించడం ఇదే తొలిసారి.

గతంలో బరువు తగ్గించే మందులు అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతి లభించలేదు. ఇక ఆయా మందులు వల్ల తీవ్ర దుష్ప్రభావాలు ఉండేవి. పైగా అవి మంచి ఫలితాన్నిచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలో తాజాగా వీగోవీకి ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో జనాలు దాని కోసం ఎగబడుతున్నారు. 
(చదవండి: ఎఫ్‌బీ అకౌంట్‌ డిలీట్‌ చేసింది.. భారీగా బరువు తగ్గింది)

ఎలా వాడాలి అంటే.. 
వీగోవీ అనేది ఇంజెక్షన్‌ రూపంలో తీసుకోవాల్సిన ఓ మెడిసిన్‌. వారానికి ఒక డోసు చొప్పున తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. దాదాపు 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉందని కంపెనీ తెలుపుతోంది. ఈ ఔషధానికి విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్‌ కంపెనీకి ఆదాయం సైతం భారీగా పెరిగింది. 

ఎలా పనిచేస్తుందంటే..
ఈ మెడిసిన్‌ జీఎల్‌పీ-1 అనే హార్మోన్‌ను అనుకరించడం ద్వారా పనిచేస్తుంది. ఇది మెదడులోని ఆకలిని, ఆహారం తీసుకోవడం నియంత్రించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇక దీనివల్ల దుష్ప్రభావాలు లేవా అంటే ఉన్నాయి. ఈ మెడిసిన్‌ తీసుకున్న వారిలో వాంతులు, యాసిడ్‌ రీఫ్లక్స్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్లు సమాచారం. 
(చదవండి: ఇమ్యూనిటీ ఫస్ట్‌...పిండి వంటలు నెక్ట్స్‌)

కోవిడ్‌ వల్ల పెరిగిన డిమాండ్‌..
ఈ మెడిసిన్‌కు ఇంత భారీగా డిమాండ్‌ పెరగడానికి కోవిడ్‌ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికబరువుతో బాధపడుతున్న వారికి కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని అధ్యయనాలు తేల్చడంతో.. అందరికీ బరువు తగ్గడంపై ధ్యాస పెరిగిందని నోవో నోర్డిస్క్‌ ఫార్మ కంపెనీ సీఈఓ లార్స్‌ జోర్గెన్సన్‌ తెలిపారు. వచ్చే ఏడాది ఆరంభం నాటికి డిమాండ్‌కు సరిపడా స్థాయిలో వీగోవీని ఉత్పత్తి చేస్తామన్నారు.

(చదవండి: ఏం చేసినా బరువు తగ్గడం లేదా.. తప్పు మీది కాదు బ్యాక్టీరియాది)

మరిన్ని వార్తలు