ట్రంపే ఫెవరేట్‌ అంటున్న బెట్టింగ్‌ మార్కెట్లు

4 Nov, 2020 11:50 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్ల మధ్య హోరాహోరి పోరు నడుస్తుంది. గద్దెనెక్కెదేవరో.. ఇంటికి వెళ్లేది ఎవరో మరి కాసేపట్లో తేలనుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌ సాగుతోంది. ట్రంప్‌కు అనుకూలంగా బెట్టింగ్‌ మార్కెట్లలో పందాలు కాస్తున్నారట. న్యూజిలాండ్‌కు చెందిన ప్రిడిక్షన్స్‌ మార్కెట్ డొనాల్డ్ ట్రంప్, బైడెన్ కంటే అధిక్యంలో ఉన్నారని తెలిపింది. కొద్ది సేపటికే న్యూజిలాండ్‌ ప్రిడిక్ట్ వెబ్‌సైట్‌కు అంతరాయం కలిగింది. దాంతో సదరు వెబ్‌సైట్‌ వీలైనంత త్వరగా సేవలను తిరిగి పప్రారంభించడానికి" కృషి చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే అంతరాయానికి గల కారణాలు మాత్రం తెలపలేదు.

ఇదిలా ఉండగా బ్రిటిష్ బెట్టింగ్ ఎక్స్ఛేంజ్ బెట్‌ఫెయిర్‌ ట్రంప్‌ గెలిచే అవకాశం 75 శాతం ఉందని తెలిపింది. అయితే మంగళవారం ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ట్రంప్‌ గెలిచే అవకాశం 39శాతంగా ఇచ్చింది. అది క్రమంగా పెరిగి ప్రస్తుతం 75శాతానికి చేరింది. ఇక బైడెన్‌ విషయానికి వస్తే తొలుత 61శాతం ఇవ్వగా ప్రస్తుతం అది 25 శాతానికి పడిపోయింది. ఉదయం 10.30 గంటల నాటికి, జో బైడెన్ వైట్ హౌస్ పోటీలో 200 కి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్ 118 ఎన్నికల ఓట్లను సాధించారు. అమెరికా అధ్యక్ష పదవిని గెలుచుకోవడానికి ఒక అభ్యర్థికి 270 ఓట్లు అవసరం. "ట్రంప్, బిడెన్‌ను గణనీయంగా అధిగమించాడు. ఇప్పుడు మంచి పొజిషన్‌లోఉన్నాడు" అని బెట్‌ఫెయిర్ ప్రతినిధి సామ్ రోస్‌బోట్టమ్ అన్నారు. బ్రిటన్ ఆధారిత స్మార్కెట్స్ ఎక్స్ఛేంజ్ ట్రంప్‌ మరోసారి గెలవడానికి 55శాతం అవకాశం ఉందని తెలిపింది. కాగా పోల్స్ ప్రారంభమైనప్పుడు ఇది 39 శాతంగా ఉండటం గమనార్హం. స్మార్కెట్లలో బైడెన్‌ విజయావకాశాలు 61శాతం నుంచి 45 శాతానికి పడిపోయాయి. (చదవండి: ట్రంప్‌కి గట్టి పోటీ ఇస్తున్న కమల)

"క్యూబా జనాభా అధికంగా ఉన్న మయామి-డేడ్ కౌంటీలో డొనాల్డ్‌ ట్రంప్ చాలా బలంగా ఉన్నారు. కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ ఫ్లోరిడాలో ట్రంప్‌ విజయానికి ఇది ప్రధాన కారణం" అని స్మార్కెట్స్‌లోని రాజకీయ విశ్లేషకుడు పాట్రిక్ ఫ్లిన్ అన్నారు. అంతేకాక ఫ్లోరిడా మొదటి నుంచి ట్రంప్‌కే అనుకూలంగా ఉందని తెలిపారు. కీలకమైన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో బైడెన్ తన అధిక్యాన్ని ప్రదర్శించగలిగితే.. అతను ఎన్నికల్లో విజయం సాధిస్తాడు అని తెలిపారు.

మరిన్ని వార్తలు