అమెరికా అధ్యక్ష ఫలితం తేలకపోతే...

7 Nov, 2020 16:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘ఎలక్టోరల్‌ కాలేజీ’ ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోయినా, ఎన్నికలు వివాదాస్పదమైనా కోర్టులు జోక్యం చేసుకొని తీర్పులు చెప్పడం అనివార్యమని అనుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా నిర్ణయాధికారాన్ని అమెరికా పార్లమెంట్‌ (కాంగ్రెస్‌)కు అప్పగిస్తారు. వాస్తవానికి దేశాధ్యక్షడి ఎన్నికల్లో అమెరికా పార్లమెంట్‌ అధికారం ఉండకూడదనే ఉద్దేశంతో అమెరికా ఎన్నికల రాజ్యాంగ నిర్ణేతలు ‘ఎలక్టోరల్‌ కాలేజీ’ని ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలో ఫలితం తేలనప్పుడు కాంగ్రెస్‌కు అప్పగించడం, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ‘ప్రజాప్రతినిధుల సభ’కు అప్పగించే ఆనవాయితీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తోంది.

1800, 1824లో జరిగిన ఎన్నికల్లో ‘విజేత’ను ఎలక్టోరల్‌ కాలేజీ తేల్చకపోవడంతో నాడు దేశాధ్యక్షుడిని నిర్ణయించే అధికారాన్ని ప్రజాప్రతినిధుల సభకు అప్పగించగా, 1800 సంవత్సరంలో థామస్‌ జఫర్‌సన్, 1824లో జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌ను ప్రజా ప్రతినిధుల సభనే ఎన్నుకుంది. దేశంలో ద్విపార్టీ వ్యవస్థ బలపడుతూ రావడంతో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకునే సంప్రదాయం దూరమవుతూ వచ్చింది. దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ‘కాంగ్రెస్‌’ ప్రమేయం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదనే ఎన్నికల నియమావళిని రచించిన నిర్మాతల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని 18వ శతాబ్దంలో ఎలక్టోరల్‌ కాలేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు.   (ట్రంప్‌ నిర్ణయాలన్నీ ‘తలకిందులే’నా?!)

ఎలక్టోరల్‌ కాలేజీ ఫలితాలు టై అయితే, అంటే ట్రంప్, బైడెన్‌లకు చెరి 269 సీట్లు వచ్చినా, ఓట్ల వివాదం వల్ల ఎవరికి 270 ఓట్లు వచ్చినా కాంగ్రెస్‌కు అప్పగించే అవకాశాలు నేడు కూడా కనిపిస్తున్నాయి. 2020 ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ జోక్యం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్‌ న్యాయవాదులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అమెరికా సుప్రీంకోర్టు కూడా ప్రతి అధ్యక్ష ఎన్నిక వివాదాల్లో జోక్యం చేసుకోదు. ఎన్నికలకు సంబంధించిన చట్టాలు, నిబంధన విషయంలో అస్పష్టత ఉంటే వాటికి వివరణ ఇచ్చేందుకు మాత్రమే పరిమితం అవుతుంది. మిగతా సందర్భాల్లో రాజకీయ నిర్ణయాధికారాన్ని రాజకీయ వ్యవస్థకే వదిలేస్తుంది. 2000 సంవత్సరంలో అమెరికా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని తీర్పు చెప్పడం చాలా అరుదు.   (నువ్వు కూడా ప్రెసిడెంట్‌ కావొచ్చు!)

అమెరికా ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్లకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నందున నిర్ణయాధికారాన్ని సభకు అప్పగిస్తే డెమోక్రట్ల అభ్యర్థి అయిన జో బైడెన్‌ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనుకుంటే పొరపాటు. ఎన్నికల్లో పాల్గొనేది ప్రజా ప్రతినిధులే అయినా ఎంత మంది సభ్యులుంటే అన్ని ఓట్లు కాకుండా ప్రతి రాష్ట్రానికి ఒక్క ఓటు చొప్పునే కేటాయిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులంతా కలిసి తమ రాష్ట్రం ఓటును ఎవరికి వేయాలనే విషయమై నిర్ణయం తీసుకుంటారు. నాలుగు కోట్ల మంది జనాభా కలిగిన కాలిఫోర్నియాకు, ఆరు లక్షల జనాభా కలిగిన వ్యోమింగ్‌ రాష్ట్రానికి ఒకే ఓటు ఉంటుంది. ప్రజా ప్రతినిధుల సభలో డెమోక్రట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు ప్రాతినిథ్యం ఉంది. 2018 నుంచి 26 రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ప్రాతినిథ్యం కొనసాగుతోంది. పైగా ఇటీవలి కాలంలో మిన్నెసోట, ఐయోవా రాష్ట్రాల్లో డెమోక్రట్లు ప్రాతినిథ్యం కోల్పోయారు. అందుకనే ఎన్నికలు వివాదమైతే అమెరికా కాంగ్రెస్‌ ద్వారా ట్రంప్‌కు కలిసొస్తుందని మొదటి నుంచి ఆయన ఎన్నికల సలహాదారులు, వ్యూహకర్తలు చెబుతూ వస్తున్నారు. 

మరిన్ని వార్తలు