ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు

27 Oct, 2020 03:19 IST|Sakshi

చురుగ్గా ఎర్లీ బ్యాలెట్లు

కౌంటింగ్‌ లేటయ్యే సూచనలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్‌ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్‌ఎన్‌ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది ఓటింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్లమంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్‌ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రాట్‌ మద్దతుదారులు అధికమని(70 శాతం) నివేదిక తెలిపింది.  
 

ఫలితాలు ఆలస్యం
ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ అనంతరం వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సీఎన్‌ఎన్‌ మరో నివేదికలో తెలిపింది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువని పేర్కొంది. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఓటయిన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించింది. వీటిలో మిన్నిసోటాలో ఎర్లీ ఓట్లు ఈదఫా ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. అలాగే ఎన్నికల్లో ముందుగా ఓటు ఉపయోగించుకున్న వారిలో యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. గత ఎన్నికల్లో ట్రంప్‌ను ఆదుకున్న కీలక రాష్ట్రాల్లో ఈదఫా మార్పు ఉంటుందని అంచనా వేసింది. టెక్సాస్‌లో ఈదఫా భారీగా ఎర్లీ ఓట్లు పోలయ్యాయి. శతాబ్దిలో లేనంతగా 70 లక్షల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 43 శాతానికి సమానం.  

>
మరిన్ని వార్తలు