బైడెన్‌ వైపే ముస్లింలు..

5 Nov, 2020 08:36 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో 69 శాతం ముస్లిం ఓటర్లు బైడెన్‌కి ఓటు వేయగా, కేవలం 17 శాతం మంది మాత్రమే డొనాల్డ్‌కు ఓటు వేసినట్లు అమెరికాలోని ముస్లిం సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ ద కౌన్సిల్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ రిలేషన్స్‌(సీఏఐఆర్‌) బుధవారం విడుదల చేసిన ఎగ్జిట్‌ ఫలితాల్లో పేర్కొంది. నమోదు చేసుకున్న 844 ముస్లిం ఓటర్ల కుటుంబాల్లో 84 శాతం మంది అత్యధికంగా ఓట్లు వేసినట్లు సీఏఐఆర్‌ సంస్థ తెలిపింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 13 శాతం ముస్లిం ఓట్లను మాత్రమే దక్కించుకున్న ట్రంప్, ఈ ఎన్నికల్లో మరో నాలుగు శాతం ఓట్లను అదనంగా సాధించగలిగారు. 

ఊహలకు భిన్నంగా..
ట్రంప్, బైడెన్‌ మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మీడియా అంచనాలకు భిన్నంగా వస్తుండడంతో, మీడియా సహనం పాటించాలని భావిస్తున్నారు. ముందస్తు ఓటింగ్‌ వల్ల కౌంటింగ్‌ ప్రక్రియ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉందని, అందువల్ల ఎటువంటి అభిప్రాయాలకూ రావద్దని మీడియా సంస్థలు తెలిపాయి. ఫలితాలన్నీ అసందిగ్ధంగా ఉన్నాయని, ఎవరు గెలుస్తారో ఇప్పటికిప్పుడే చెప్పలేమని సీబీఎస్‌ న్యూస్‌ ఎనలిస్ట్‌ జాన్‌డికర్సన్‌ అన్నారు. సంవత్సరానికి పైగా ప్రచారంలో తలమునకలైన జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా ఫలితాలను ఊహించలేకపోవడం గమనార్హం. (చదవండి: బైడెన్‌కే ‘లిటిల్‌ ఇండియా’ ఓట్లు)

జాత్యహంకారమున్నా
అట్లాంటా: అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకారాన్ని సమర్థిస్తూ నల్లజాతి ప్రజలను తరచూ తిట్టిపోసే మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి అయిన ఆమె నార్త్‌వెస్ట్‌ జార్జియా స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వ్యాపారవేత్త అయిన టేలర్‌ గ్రీన్‌ కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే ట్రంప్‌ దృష్టిలో పడ్డారు. ఆమెను ట్రంప్‌ ‘ఫ్యూచర్‌ రిపబ్లికన్‌ స్టార్‌’అని వర్ణించడం గమనార్హం. ఆమె జాత్యహంకారాన్ని సమర్థిస్తూ ఆన్‌లైన్‌లో వీడియోలు విడుదల చేస్తుంటారు. నల్లజాతి, హిస్పానిక్‌ ప్రజలను దూషిస్తుంటారు. వారు ముఠాలు కడుతుంటారని, మాదక ద్రవ్యాల బానిసలని విమర్శిస్తుంటారు. 
 

మరిన్ని వార్తలు