కత్తిరింపునకు గురైన అత్యంత వివాదస్పద ‘మీసం’!

27 Jul, 2020 13:09 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాలో వివాదాలకు దారి తీసిన ‘మీసం’ బ్లేడ్‌ కత్తిరింపునకు బలైంది. అనేక సందర్భాల్లో విమర్శల పాలైన యూఎస్‌ రాయబారి హ్యారీ హారిస్‌ ఎట్టకేలకు తన మీసాన్ని కత్తిరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. ‘‘సంతోషం. ఇప్పటికైనా ఇది పూర్తైంది’’ అని పేర్కొన్నారు. రాజధాని సియోల్‌లో నమోదయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేశానని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించడానికి వీలుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా జపనీస్‌ మూలాలు(తల్లి తరఫున) ఉన్న రిటైర్డ్ నేవీ అడ్మిరల్ అయిన హ్యారీ హారిస్ 2018 నుంచి దక్షిణ కొరియాలో అమెరికా రాయబారిగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన మీసకట్టుతో అనేకసార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 1910 నుంచి 1945 వరకు కొరియా ద్వీపకల్పంలో కొనసాగిన జపాన్‌ వలస పాలనలోని గవర్నర్ల స్టైల్‌ను గుర్తు చేసేలా ఉన్న మీసకట్టు కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే ఏడాదిలోనే అందరికీ వ్యాక్సిన్‌

అయితే ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని హ్యారీ.. తన వ్యక్తిగత నిర్ణయాన్ని, శైలిని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. అదే విధంగా... ఇరు దేశాల మధ్య(జపాన్‌- కొరియా) ఉన్న చారిత్రాత్మక శత్రుత్వం గురించి తనకు తెలుసునని, అయితే తానిప్పుడు జపనీస్‌ అంబాసిడర్‌గా దక్షిణ కొరియాలో పదవి చేపట్టలేదని, అమెరికా రాయబారిగా మాత్రమే ఉన్నానంటూ వివాదానికి తెరతీశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిర్ణయం మార్చుకున్న ఆయన ఇటీవల తన మీసాన్ని కత్తిరించుకోవడం విశేషం. కాగా దక్షిణ కొరియా, జపాన్‌ రెండూ అమెరికా ప్రధాన మిత్ర దేశాలన్న సంగతి తెలిసిందే. అయితే చైనా, ఉత్తర కొరియాను ఎదుర్కొనే క్రమంలో ఈ రెండూ అమెరికాతో దోస్తీ కట్టినప్పటికీ.. గతంలో తమ మధ్య ఉన్న శత్రుత్వం దృష్ట్యా అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్‌, ఆయన మీసాన్ని విమర్శిస్తూ కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. (ఆంత్రాక్స్‌పై పాక్, చైనా పరిశోధనలు?)

మరిన్ని వార్తలు