‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!

30 Nov, 2023 07:46 IST|Sakshi

అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

నిఖిల్ గుప్తాపై నేరం రుజువైతే, అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా నుంచి అందిన ఇన్‌పుట్‌పై విచారణ జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి నవంబర్ 18న భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించే వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం  తగిన చర్యలు చేపట్టనుంది. 

ఇదిలాఉండగా నవంబర్ 20న గురుపత్వంత్ సింగ్ పన్నుపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎయిరిండియాలో ప్రయాణించే వ్యక్తులను భయాందోళనకు గురిచేసేలా పన్నూ సోషల్ మీడియా సందేశాలను జారీ చేశారని ఎన్‌ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ప్రయాణించేవారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ సందేశం పంపాడు. నవంబర్ 19న ఎయిరిండియాకు అనుమతి ఇవ్వబోమని కూడా ఆయన పేర్కొన్నాడు. 

కాగా దీనికిముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కెనడా ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. కెనడాతో భారత ప్రభుత్వ దౌత్యపరమైన వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెరికా న్యాయ శాఖ ఈ ప్రకటన వెలువరించడం విశేషం.

నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు హర్దీప్ సింగ్ నిజ్జర్ చీఫ్. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న ఇతను ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. ఇతని హత్యపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని భారత్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. అయితే కెనడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు అందించలేదు.
ఇది కూడా చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం

మరిన్ని వార్తలు