Afghanistan: రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్‌ డాలర్ల పరికరాలు

31 Aug, 2021 19:36 IST|Sakshi

కాబూల్‌: అమెరికా భద్రతా బలగాలు అఫ్గానిస్తాన్‌ నుంచి అడుగు బయట పెట్టగానే.. తాలిబన్లు రెచ్చిపోయారు. అఫ్గానిస్తాన్‌లోని  కాందహార్‌ మీదుగా వెళ్తున్న యూఎస్‌ బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌కు ఓ మృతదేహాన్ని తాడుతో వేలాదీసి కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరవై ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31 తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం అఫ్గాన్‌ నుంచి బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: Afghanistan Crisis: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే!

అయితే తాజాగా ‘‘కాందహార్ ప్రావిన్స్‌లో పెట్రోలింగ్ చేయడానికి తాలిబన్లు తీసుకున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్‌కు తాలిబన్లు ఓ వ్యక్తిని చంపి అతడిని వేలాడతీశారు’’ అంటూ పలువురు జర్నలిస్టులు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై సెనేటర్‌ టెడ్‌ క్రజ్‌ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండి పడ్డారు. ఈ విపత్తును తీవ్రమైన విషాదంగా.. ఊహించలేనిదిగా వర్ణించారు. అయితే ఆ మృతదేహం అమెరికాకు చెందిన ఓ వ్యాఖ్యాతది అంటూ ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి.

కాగా అఫ్గానిస్తాన్‌లో  బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను యూఎస్ దళాలు అక్కడే వదిలేశాయి. ఇప్పుడు వాటిని తాలిబన్లు ఉపయోగించనున్నారు. కాబూల్ విమానాశ్రయంలో 73 విమానాలు, 27 హై-మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్ (హమ్వీ) కూడా అక్కడే వదిలేశారు. వాటితో పాటు కౌంటర్ రాకెట్, ఆర్టీలరీ, మోర్టార్ (సి-ర్యామ్) క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ గాగుల్స్ కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు

>
మరిన్ని వార్తలు