ఆ కల తీరుతుందా?

9 Nov, 2020 04:42 IST|Sakshi
మోదీతో బైడెన్‌ (ఫైల్‌)

ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్‌ కొనసాగించనున్నారు.

ఉగ్రవాదం
పాక్‌ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్‌పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్‌ ఉంది.

చైనాతో వైఖరి
వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్‌కి కీలకం. ట్రంప్‌  భారత్‌కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్‌ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి.

మానవ హక్కులు
మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్‌ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌పై బైడెన్‌ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్‌లో 360 ఆర్టికల్‌ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు.  

వీసా విధానం
హెచ్‌–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్‌ విధానాలు భారత్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్‌ నినాదంతో ట్రంప్‌ హెచ్‌–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్‌ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది

కమలా హ్యారిస్‌ పాత్ర
వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్‌తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్‌ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘2020 నాటికి అమెరికా, భారత్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల
— 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌

మరిన్ని వార్తలు