రెండు టీకా డోసులు తీసుకుంటే మాస్కులు అక్కర్లేదు

29 Apr, 2021 01:55 IST|Sakshi

అమెరికా సీడీసీ

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారికి భారీ ఊరట లభించింది. టీకా తీసుకున్న వారందరూ బయటకి వచ్చినప్పుడు మాస్కులు ధరించనక్కర్లేదని ది సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మినహాయింపునిచ్చింది. అయితే సమూహాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు టీకా డోసులు తీసుకున్న వారంతా బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు, పరుగులు పెట్టినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు,  బైక్‌ మీద ఒంటరిగా వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోనక్కర్లేదని ది సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది.

అయితే పార్టీలు, ఫంక్షన్లు, స్పోర్ట్స్‌ స్టేడియాలు, ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాత్రం మాస్కు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ప్రజలందరూ ముందుకు వచ్చి టీకాలు తీసుకొని మాస్కు లేని ప్రపంచంలో తిరగవచ్చునని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మాస్కులు అక్కర్లేదని ప్రకటించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్‌ నిలిచింది. 

చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్‌డౌన్‌?)  

మరిన్ని వార్తలు