Corona Virus: కరోనా ట్విండెమిక్‌గా మారుతుందా?

10 Oct, 2021 05:00 IST|Sakshi

యూఎస్‌ వైద్య నిపుణుల సందేహం

దేశవ్యాప్త రికవరీ రేటు 97.98

రష్యాలో భారీగా కరోనా మరణాలు

న్యూఢిల్లీ/పిట్స్‌బర్గ్‌/మాస్కో/లండన్‌:  అమెరికాలోని వైద్యాధికారులకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ దేశంలో ప్రస్తుతం శీతాకాలం జరుగుతోంది. దీంతో కరోనా రోగంతో పాటు సీజనల్‌గా వచ్చే ఫ్లూ (జలుబు) కూడా సోకుతోంది. ప్రస్తుతం కరోనాను పాండెమిక్‌ (మహమ్మారి) అని పిలుస్తున్న నేపథ్యంలో కరోనా, సీజనల్‌ ఫ్లూని కలిపి ట్విండెమిక్‌గా (రెండు పాండెమిక్‌లు కలసి) వ్యవహరిస్తారు.

ఈ తరహా రూపంలో వచ్చే కేసులను ప్రస్తుతం మేథమేటికల్‌ మోడల్స్‌ ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు తీసుకునే చర్యలు ఫ్లూకి కూడా అడ్డుకట్ట వేస్తాయని అన్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో గత మూడు వారాల్లో 20 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ ఇచ్చినట్లు యూకే ఆరోగ్య సంస్థ శనివారం ప్రకటించింది. కోవిడ్‌ నుంచి అత్యధిక ముప్పు ఉన్న వర్గాలను ఎంపిక చేసి వారికి వ్యాక్సినేషన్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది.   

19,740  కొత్త కరోనా కేసులు
భారత్‌లో శనివారం 19,740 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,36,643కు తగ్గింది. గత 206 రోజుల్లో ఇదే అత్యంత కనిష్ట సంఖ్య కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,32,48,291కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్త రికవరీ రేటు 97.98గా ఉంది. మరణాల శాతం 1.33గా ఉంది. ఇదిలా ఉండగా అండమాన్‌ నికోబార్‌ కేంద్ర పాలిత ప్రాంతంలో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 10 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకూ 94.62 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్‌ జరిగింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. భారత్‌కు ప్రపంచ నలుమూలల నుంచి వ్యాక్సిన్‌ తయారీ ముడి పదార్థాల సరఫరా కొనసాగాలని కోరారు. భారత్‌లో వ్యాక్సిన్‌ల తయారీ ఊపు అందుకున్న నేపథ్యంలో కోవ్యాక్స్‌ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి కూడా వ్యాక్సిన్లను అందించేందుకు అది ఉపకరిస్తుందని పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ మైత్రి ద్వారా ఐక్యరాజ్య సమితి ద్వారా 2021 నాలుగో త్రైమాసికంలో వ్యాక్సిన్లను అందిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా రష్యాలో రోజూవారీ మరణాలు శనివారం ఏకంగా 968 నమోదయ్యాయి. సెపె్టంబర్‌ చివరి రోజులతో పోలిస్తే 100కు పైగా అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రష్యాలో శనివారం 29 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో మరణాలు 6 లక్షలు దాటాయి. ఈ నేపథ్యంలో అక్కడ పలు బార్లు నిండిపోయి కనిపిస్తున్నాయి. డెల్టా వైరస్‌ విస్తరిస్తోందన్న అనుమానాలు ఓ వైపు ఉండగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

కాంగోలో ఎబోలా కేసు..
ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌ సోకి మూడేళ్ల బాలుడు మరణించిన ఘటన కాంగోలో చోటు చేసుకుంది. గత అయిదు నెలలుగా కాంగోలో ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. అంతకు ముందు 6 మంది ఎబోలా కారణంగా మరణించారు. బాలున్ని ఆస్పత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, అక్టోబర్‌ 6న కన్నుమూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించాక ఎబోలా పాజిటివ్‌గా తేలిందన్నారు.   

మరిన్ని వార్తలు