చైనాను దీటుగా ఎదుర్కొంటాం

17 Mar, 2021 03:16 IST|Sakshi

అమెరికా, జపాన్‌ విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం

టోక్యో: అమెరికాలో జో బైడెన్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌లో తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. జపాన్‌ విదేశాంగ మంత్రి తొషిమిట్సు మోతెగి, రక్షణ మంత్రి నోబూ కిషిలతో మంగళవారం ముఖాముఖి చర్చలు జరిపారు. ఆసియాలో చైనా బలప్రయోగం, దూకుడు చర్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని ఆ సమావేశంలో ఇరు దేశాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛయుత వాతావరణం నెలకొనడానికి అమెరికా తానే ముందుండి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. చైనా, దాని మిత్రపక్షమైన ఉత్తర కొరియాల నుంచి ఎవరైనా సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటే ఆ దేశాలకు బైడెన్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై తీవ్రంగా విమర్శించిన మంత్రులిద్దరూ బుధవారం దక్షిణ కొరియా నేతలతో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాలకు చెందిన మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దేశం ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యల్ని తీవ్రంగా ఖండించారు. 

మరిన్ని వార్తలు