హెచ్‌1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట

2 Dec, 2020 11:12 IST|Sakshi

ట్రంప్‌ ఆదేశాలను తోసిపుచ్చిన అమెరికా ఫెడరల్‌ కోర్టు

ట్రంప్‌ ఆదేశాలను సవాల్‌ చేసిన గ్రూపులకు  చట్టపరమైన విజయం

వాషింగ్టన్‌:  హెచ్‌1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన  హెచ్‌1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో  ట్రంప్‌ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని  ఈ మార్పులు  కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్  సర్కార్‌కు  అందకుముందే ఈ  ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ  వ్యాఖ్యానించారు.

ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్‌ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై  చట్టపరమైన విజయం సాధించారు.  ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై  సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు  ట్రంప్ ఓటమి,  జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు  ట్రంప్‌  సర్కార్‌  వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్‌ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ 1బీ వీసాలపై   మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ  ఉద్యోగాల నియామకాలపై  ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్‌, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు  సవాల్‌చేసిన సంగతి తెలిసిందే. అమెరికా  ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్‌1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్‌, చైనాకు చెందిన వారే ఉన్నారు.

కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు.  తద్వారా  లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్‌పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది.  బైడెన్‌ వాగ్దానం ప్రకారం  హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే  ఇమ్మిగ్రేషన్ పాలసీని  సైతం సవరించే అవకాశం ఉందని అంచనా.

మరిన్ని వార్తలు