భారత్‌- అమెరికాల బంధం మరింత బలపడాలి

6 Aug, 2020 09:15 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ‌(ఫైల్‌ ఫొటో)

అమెరికా హౌజ్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ లేఖ

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌- అమెరికా మధ్య బంధం మరింత బలపడాలని అగ్రరాజ్య చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇండో- పసిఫిక్‌ ప్రాదేశిక జలాల విషయంలో చట్టవ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న డ్రాగన్‌ ప్రభుత్వానికి దీటుగా జవాబిచ్చేందుకు ఇదెంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఇరు దేశాల మధ్య బంధం పటిష్టం కావాలని ఆకాంక్షించారు. సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకునే క్రమంలో అమెరికా భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు అమెరికా హౌజ్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎలియట్‌ ఏంగెల్‌, ర్యాంకింగ్‌ మెంబర్‌ మైఖేల్‌ టీ మెకౌల్‌ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు లేఖ రాశారు. కాగా తూర్పు లఢక్‌ ప్రాంతంలోని గల్వాన్‌ లోయలో చైనా పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అగ్రరాజ్యం వివిధ దేశాలతో కలిసి పనిచేస్తోంది.(అమెరికా, బ్రిటన్‌లో జైశ్రీరామ్‌)

ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి..
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన ఏడాది తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఎలియట్‌ ఏంగెల్, మైఖేల్‌ టీ మెకౌల్‌పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘ ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో అక్కడ చెలరేగుతున్న ఆందోళనలు, చేపట్టిన భద్రతా కార్యక్రమాల గురించి మాకు అవగాహన ఉంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్వీట్‌ చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుసరిస్తూ ఇరు దేశాల మధ్య సత్పంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.(కశ్మీర్‌ ఓ నివురుగప్పిన నిప్పు)

మరిన్ని వార్తలు