భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!

23 Apr, 2023 04:42 IST|Sakshi

విద్యార్థి వీసాలకు ప్రాధాన్యతనిస్తాం

అమెరికా ఉన్నతాధికారి డొనాల్డ్‌ వెల్లడి

వాషింగ్టన్‌: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్‌ సర్కార్‌ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం)  డొనాల్డ్‌ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియలో హెచ్‌–1బీ, ఎల్‌–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం.

విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్‌ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్‌ సీజన్‌లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్‌ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్‌ రెండోస్థానంలో ఉంది.

కొన్ని చోట్ల 60 రోజుల్లోపే..
‘హెచ్‌–1బీ, ఎల్‌ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్‌లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్‌ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్‌ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్‌ ఆధారిత నాన్‌ఇమిగ్రెంట్‌ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్‌ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్‌–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్‌ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు