-

US Midterm Election 2022: బైడెన్‌ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!

8 Nov, 2022 05:09 IST|Sakshi
న్యూయార్క్‌లో కేథీ హొచుల్‌ అభ్యర్థిత్వానికి బైడెన్‌ మద్దతుదారుల ప్రచారం

ప్రతినిధుల సభలో 435, సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు 

అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిష్టకు పరీక్ష

డొనాల్డ్‌ ట్రంప్‌ రాజకీయ భవిష్యత్తు తేలిపోయే అవకాశం 

అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్‌ టర్మ్‌) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు.  

మధ్యంతర ఎన్నికలంటే?   
అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. 

మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు.  

గెలిచేదెవరో?  
అధికార డెమొక్రటిక్‌ పార్టీకి కాంగ్రెస్‌ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్‌ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్‌ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్‌ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్‌ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు.  

ప్రభావితం చేసే అంశాలేమిటి?   
దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్‌ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి.

ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్‌ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్‌ అజెండాకు అడ్డుకట్ట తప్పదు.                

అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా?
మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్‌ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్‌ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు