US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే

26 Nov, 2022 04:58 IST|Sakshi

ఆసక్తికరంగా అమెరికా మధ్యంతర ఫలితాలు

పనితీరు బాగాలేకున్నా పరువు దక్కించుకున్న అధికార డెమొక్రాట్లు

బైడెన్‌ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో విఫలమైన రిపబ్లికన్లు

వారి పాలిట వదిలించుకోవాల్సిన భారంగా మారిన డొనాల్డ్‌ ట్రంప్‌

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి
 అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి.

రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్‌పై అధికార డెమొక్రాట్‌ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్‌ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్‌ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్‌కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం.

నెత్తిన పాలు పోసిన ట్రంప్‌
ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్‌ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్‌లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్‌ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్‌ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్‌పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు.

‘అమెరికా ఫస్ట్‌’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్‌ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్‌ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్‌ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్‌పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్‌కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌          అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది.

అధికార పక్షాలకు ఎదురుగాలే...!
అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్‌ పార్టీ సెనేట్లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్‌ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్‌ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్‌ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్‌ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది!

మన మాదిరిగా కాదు...
మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్‌ టర్మ్‌) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.

మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్‌ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్‌తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. 

మరిన్ని వార్తలు