మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్‌ రివర్స్‌.. బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

10 Nov, 2022 09:20 IST|Sakshi

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. రిపబ్లికన్‌ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్‌ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్‌.. అధిక మెజారిటీ ద్వారా  అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ  వైట్‌ హౌజ్‌లో జరిగిన న్యూస్‌ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన.

మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్‌ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్‌ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ..  రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్‌ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్‌ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్‌ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్‌ ఆఫ్‌ రెప్రజెంటివ్స్‌లో రిపబ్లికన్‌ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్‌ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు