హెచ్‌1బీ లాటరీకి చెల్లుచీటి

9 Jan, 2021 04:14 IST|Sakshi

ఎంపిక ప్రక్రియలో ట్రంప్‌ సర్కారు సవరణలు  

మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే పెద్దపీట

వాషింగ్టన్‌:  హెచ్‌–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానానికి స్వస్తి పలికింది. హెచ్‌–1బీ వీసాల మంజూరు విషయంలో మంచి వేతనాలు, నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను శుక్రవారం ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురించింది. నూతన ఎంపిక ప్రక్రియ 60 రోజుల్లో అమల్లోకి రానుంది. హెచ్‌–1బీ వీసాకు భారీ డిమాండ్‌ ఉంది. ఇది నాన్‌–ఇమ్మిగ్రెంట్‌ వీసా. ఈ వీసాతో అమెరికా కంపెనీలు నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాలోనే నియమించుకోవచ్చు.

అమెరికా ఐటీ కంపెనీలు ప్రతిఏటా భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగులను ఈ వీసా ద్వారానే రప్పించుకుంటున్నాయి. తదుపరి హెచ్‌–1బీ వీసా ఫైలింగ్‌ సీజన్‌ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌–1బీ వీసాల ఎంపిక ప్రక్రియలో సవరణలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. అమెరికాలోకి వలసలను నిరోధించే దిశగా ఇది మరో ప్రయత్నమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో భారతదేశ ఐటీ నిపుణులు, ఐటీ సంస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ను జో బైడెన్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పునఃసమీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ యంత్రాంగం నోటిఫికేషన్‌పై ఐటీ వర్గాలు స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు