రష్యాతో కలిసి పని చేస్తాం: నాసా సంచలనం.. ముందుగానే కౌంటర్‌ ఇచ్చిన పుతిన్‌

15 Jul, 2022 20:40 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ..  రష్యాను ఏకాకిని చేసేందుకు అమెరికా శతవిధాల ప్రయత్నించింది. ఆంక్షల ద్వారా ప్రపంచ దేశాలను మాస్కోకు దూరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసింది. అయితే.. ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకుంది అగ్రరాజ్యం. 

రష్యాతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విమానాలను తిరిగి ప్రారంభిస్తామని  శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది. ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిరంతర సురక్షిత కార్యకలాపాలను నిర్ధారించడానికి, వ్యోమగాముల జీవితాలను పరిరక్షించడానికి.. అంతరిక్షంలో నిరంతరం US ఉనికిని నిర్ధారించడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంటోంది. నాసా US క్రూ స్పేస్‌క్రాఫ్ట్-రష్యన్ సోయుజ్‌లో సమీకృత సిబ్బందిని తిరిగి ప్రారంభిస్తుంది అని నాసా ఆ ప్రకటనలో ప్రకటించింది. అయితే.. 

నాసా ఈ ప్రకటన కంటే ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోస్‌ కాస్మోస్‌ సంస్థ డైరెక్టర్‌ దిమిత్రి రోగోజిన్‌ను బాధ్యతల ఆఘమేఘాల మీద తప్పించారు. ఈ మేరకు క్రెమ్లిన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తద్వారా నాసా ప్రకటనకు తాము సానుకూలంగా లేమనే సంకేతాలను ఆయన పంపిచినట్లయ్యింది.

నాసా ప్రకటన కంటే ముందే దిమిత్రిని తప్పించడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాసాకు అనుకూలంగా వ్యవహరించాడనే ఆరోపణలపైనే ఆయన్ని తొలగించారా అనే కోణంలోనే పలు అంతర్జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు ప్రచురిస్తున్నాయి. మరోవైపు రష్యాతో కలిసి పని చేయడం తప్ప.. ఐఎస్‌ఎస్‌ విషయంలో అమెరికాకు మరో మార్గం లేదా? అని ప్రశ్నిస్తున్నారు పలువురు.

మరిన్ని వార్తలు