రహమాన్‌ పాటను పాడిన యూఎస్‌ నేవీ...!

29 Mar, 2021 15:35 IST|Sakshi

వాషింగ్టన్‌: ఇటీవల భారత్‌ అమెరికా మధ్య జరిగిన ఇండో-పసిఫిక్‌ చర్చల్లో భాగంగా జరిగిన విందులో  ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికా నేవీ బృందం శనివారం జరిగిన విందులో  భారత రాయబారిని  ఆశ్యర్యానికి గురిచేశారు. ఎఆర్‌ రహమాన్‌ బాణీలను అందించిన ‘స్వదేశ్‌’ హిందీ చిత్రంలోని ‘యే జో దేశ్‌ హే తెరా’ పాటను అమెరికా నేవీ బృందం పాడారు.  ఇరు దేశాల మైత్రి బంధం ఎప్పటికి విడిపోదని ఈ పాటతో తెలిపారు. ఈ కార్యక్రమంలో  చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (సిఎన్ఓ) మైఖేల్ ఎం గిల్డేతో పాటు , భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు పాల్గొన్నారు. నేవీ బృందం పాడిన వీడియోను భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధు ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది.

యూఎస్‌ నేవీ చీఫ్‌ ఆఫ్‌ నావల్‌ ఆపరేషన్స్‌ అధికారి మైఖేల్‌ గిల్డ్‌ ట్వీటర్‌లో.. భారత రాయబారిని కలిసినందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమెరికా-భారత్‌ నేవీల మైత్రి, సహాయ సహకారాలు ఎల్లప్పుడు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్‌ ఆపరేషన్స్‌లో ఇరుదేశాలు బహిరంగ , సమగ్రనియమాలకు కట్టుబడి ఉన్నాయని గిల్డ్ ట్వీ టర్‌లో తెలిపారు .హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో అమెరికా, భారతదేశం మధ్య సహకారం మరింత మెరుగుపడింది.

ఇటీవలే భారత్‌, అమెరికా, జపాన్ ,ఆస్ట్రేలియాతో  నాలుగు దేశాల మధ్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే . హిందూ మహాసముద్రంలో  చైనా మితిమీరిన పనులకు సమాధానమే  ఈ సమావేశం. అంతేకాకుండా చైనా నుంచి  ముప్పును ఎదుర్కొంటున్న తైవాన్‌కు , అమెరికా విస్తృతమైన మద్దతును తెలిపింది. నిరంతరం చైనా విమానాలు  తైవాన్‌ ప్రాదేశిక సరిహద్దులను ఉల్లంఘిస్తోంది.

చదవండి: First City on Mars: అంగారక నగరం.. నువా!

మరిన్ని వార్తలు