అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా

9 Oct, 2021 06:34 IST|Sakshi

దక్షిణ చైనా సముద్రంలో ఘటన..ఆలస్యంగా వెలుగులోకి

బీజింగ్‌: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌’ ప్రమాదానికి గురైవ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘యూఎస్‌ఎస్‌ కనెక్టికట్‌’ గత శనివారం అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు అంతగా ప్రమాదకరం కాని విధంగా గాయపడ్డారని గురువారం యూఎస్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్‌మెరీన్‌ కనెక్టికట్‌ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్‌ ప్రొపల్షన్‌ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది.

అయితే, ఈ జలాంతర్గామి మునిగిపోయిన ఓడనో, మరే వస్తువునో ఢీకొట్టి ఉంటుందే తప్ప..మరో సబ్‌మెరీన్‌ను మాత్రం కాదని ఓ అధికారి వివరించారు. ప్రస్తుతం ఈ జలాంతర్గామి గ్వామ్‌ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే ఈ ఘటన వివరాలను వెంటనే వెల్లడించలేక పోయినట్లు వివరించారు. కాగా, ప్రమాద ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం, ఇతర వివరాలను వెంటనే బహిరంగపర్చాలని డిమాండ్‌ చేసింది. స్వేచ్ఛా సముద్రయానం పేరుతో ఈ ప్రాంతంలో అమెరికా జరుపుతున్న వాయు, నౌకా విన్యాసాలే ఘటనకు కారణమని నిందించింది. 

మరిన్ని వార్తలు