ఇజ్రాయెల్‌–పాలస్తీనా శాంతికి కృషి

16 Jul, 2022 04:52 IST|Sakshi
అబ్బాస్‌తో జో బైడెన్‌

బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి.

ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్‌ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్‌ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు.

ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్‌ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్‌ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్‌ కాలనీల విస్తరణపై స్పందించలేదు.

మరిన్ని వార్తలు