Joe Biden: రిపోర్టర్‌పై బైడెన్‌ సీరియస్‌.. అంత కోపమెందుకో?

17 Jun, 2021 16:14 IST|Sakshi

జెనీవా: సాధారణంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మీడియా ముందు సౌమ్మంగానే ఉంటారు. కానీ బుధవారం జరిగిన సమావేశంలో ఆయన స‌హ‌నం కోల్పోయారు. అందరు చూస్తుండగానే ఓ రిపోర్ట‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తొలి శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం విలేకరుల సమావేశంలో బైడెన్ మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తరువాత ఆయన ఆ రిపోర్టర్‌కు క్షమాపణలు కూడా చెప్పారులెండి. అసలు  బైడెన్ కోపం తెప్పించేలా ఏం అడిగారు?.

పుతిన్‌తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ సీఎన్ఎన్ వైట్‌హౌజ్ క‌రెస్పాండెంట్ కైట్లాన్ కొలిన్స్ ప్రశ్నలు అడుగుతూ.. ఈ భేటీ తర్వాత అయినా పుతిన్‌ తన ప్రవర్తనను మార్చుకుంటార‌నే విశ్వాసం మీకు ఉందా అని పదే పదే అడిగారు. సైబ‌ర్ అటాక్స్‌, మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల గురించి ప్ర‌శ్న‌ల‌కు పుతిన్‌ దగ్గర నుంచి స‌రిగా స‌మాధానం రాలేదని అడిగారు. అలాంట‌ప్పుడు ఇది నిర్మాణాత్మ‌క భేటీ ఎలా అవుతుంద‌ని ఆ రిపోర్టర్‌ ప్ర‌శ్నించారు. దీంతో బైడెన్ ఒక్కసారిగా రిపోర్టర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీనికి ఆయన స్పందిస్తూ.. ‘అతను తన ప్రవర్తనను మార్చుకుంటాడని నాకు నమ్మకం లేదు. అయినా నేను నమ్మకంగా ఉన్నానని ఎప్పుడు చెప్పాను? నాకు దేనిపైనా నమ్మకం లేదు. నేను ఒక వాస్తవాన్ని చెబుతున్నాను. అది మీకు అర్థం కాక‌పోతే నేనేమీ చేయ‌లేనని ’ అసహనం వ్యక్తం చేశారు. అదే క్రమంలో బైడెన్.. "నా ఎజెండా రష్యాకు లేదా మరెవరికీ వ్యతిరేకం కాదు, అది కేవలం అమెరికన్ ప్రజల కోసం" అని పుతిన్‌తో చెప్పినట్లు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. సమావేశం ముగియడంతో బయలు దేరిన బైడెన్ వెనక్కి వచ్చి ఆ రిపోర్టర్‌కు క్షమాపణ చెప్పి వెళ్లారు.

చదవండి: విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు

మరిన్ని వార్తలు