అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా

2 Aug, 2020 02:54 IST|Sakshi

అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన

వాషింగ్టన్‌: చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఈ యాప్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.

‘శనివారం కల్లా ఈ చైనా యాప్‌పై చర్యలు తీసుకుంటా.  నాకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుంటా లేదా ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులను జారీ చేస్తా’అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. టిక్‌టాక్‌ హక్కులను అమెరికా కంపెనీ కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

అమెరికాలో టిక్‌టాక్‌ హక్కుల కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల వేలకోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు చురుగ్గా చర్చలు జరుపుతున్నారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో శుక్రవారం ఒక కథనం వెలువడింది. ఈ చర్చల్లో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తోపాటు అధ్యక్ష భవనం ప్రతినిధులు  పాల్గొన్నారని తెలిపింది. అమెరికన్ల  వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై  విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో విమర్శలు చేస్తున్నారు.

29 వేల చైనా యాప్‌ల తొలగింపు
చైనీస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి శనివారం అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌  తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్‌ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్‌ లేని గేమ్‌ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్‌ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ అంటోంది. చైనా ఆండ్రాయిడ్‌ యాప్‌ స్టోర్స్‌ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో యాపిల్‌ తన యాప్‌ స్టోర్‌ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్‌సెల్‌ వంటివి కూడా ఉన్నట్లు సమాచారం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు