భారత్‌పై ట్రంప్‌ విమర్శలు

17 Oct, 2020 03:41 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు భారత్‌పై నోరు పారేసుకున్నారు. చైనా, రష్యాలతో కలిసి భారత్‌ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. నార్త్‌ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌ పాల్గొన్నారు. తన నేతృత్వంలో అమెరికా ఇంధన స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. ‘‘ మన పర్యావరణ, ఓజోన్‌ ఇతర గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి’’ అని ఆయన ర్యాలీలో ఆరోపించారు.

పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ డీల్‌ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్‌ 2017లో ప్రకటించారు. ఈ డీల్‌తో తమకు కోట్లాది డాలర్ల వ్యయం అవుతుందని, పలు ఉద్యోగాలు పోతాయని అప్పట్లో ట్రంప్‌ విమర్శించారు. అవకాశం వచ్చినప్పుడల్లా పర్యావరణం విషయంలో చైనాతో పాటు భారత్‌పై ట్రంప్‌ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పారిస్‌ డీల్‌తో ఈ రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని, యూఎస్‌కు ఏమీ ఉపయోగం ఉండదని ఆయన విమర్శించారు. తాజాగా ఇదే అక్కసును మరోమారు వెలిబుచ్చారు.  

పేపర్‌ వాడకంపై ఎద్దేవా
పర్యావరణాన్ని రక్షించే క్రమంలో ప్లాస్టిక్‌ వాడకం తగ్గించి దాని బదులు పేపర్‌ వాడకం జరపాలన్న వాదనను ట్రంప్‌ ఎద్దేవా చేశారు. ఇలాంటి సూచనలిచ్చేవాళ్లను ‘క్రేజీ’అంటూ ఎగతాళి చేశారు. అమెరికాలో స్వదేశీయులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి  ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. స్వదేశీయులను కాదని విదేశీయులతో ఉద్యోగాలు నింపినందుకు టెన్నెసీ వాలీ అథార్టీ చైర్మన్‌ను తాను తొలగించినట్లు చెప్పకొచ్చారు.  అక్రమవలసదారులకు పౌరసత్వ కల్పిస్తానన్న బైడెన్‌ వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు