ట్రంప్‌ అభిశంసన

16 Jan, 2021 04:32 IST|Sakshi

ఆమోదించిన ప్రతినిధుల సభ

మద్దతిచ్చిన 10 మంది రిపబ్లికన్‌ సభ్యులు

సెనెట్‌ ముందుకు తీర్మానం; బైడెన్‌

ప్రమాణస్వీకారం తరువాతే నిర్ణయం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన తీర్మానాన్ని బుధవారం ప్రతినిధుల సభ ఆమోదించింది. అమెరికా చరిత్రలోనే ప్రతినిధుల సభలో రెండు సార్లు అభిశంసనకు గురైన అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. క్యాపిటల్‌ భవనంపై దాడికి బాధ్యుడిని చేస్తూ డెమొక్రటిక్‌ సభ్యులు ప్రతినిధుల సభలో ‘తిరుగుబాటు చేసేలా రెచ్చగొట్టారు’అనే ప్రధాన ఆరోపణతో ట్రంప్‌ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఈ తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది.

ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. 10 మంది రిపబ్లికన్‌ సభ్యులు కూడా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. అమెరికా చరిత్రలో ఇది నాలుగో అభిశంసన ప్రక్రియ. మద్దతుదారులను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ప్రసంగించారని, ఆ కారణంగానే ప్రజాస్వామ్య సౌధమైన క్యాపిటల్‌ భవనంపై దాడితో పాటు హింస చెలరేగిందని ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో ఆరోపించారు. ఆ దాడి కారణంగా ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను పార్లమెంటు నిర్ధారించే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ హింసలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ప్రతినిధుల సభలో ఆమోదం పొందడంతో, ఈ అభిశంసన తీర్మానం సెనెట్‌కు వెళ్తుంది. సెనెట్‌లో కూడా ఆమోదం పొందితే.. ట్రంప్‌ ఇక జీవితకాలంలో దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టలేరు. అయితే, సెనెట్‌ సమావేశాలు ఇప్పటికే జనవరి 19 వరకు వాయిదా పడ్డాయి. జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, అధ్యక్షుడిగా గడువు ముగిసేవరకు వైట్‌హౌజ్‌లో కొనసాగే అవకాశం ట్రంప్‌కు లభించింది. బైడెన్‌ ప్రమాణ స్వీకారం లోపు సెనెట్‌లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ముగిసే అవకాశం లేదని సెనెట్‌ మెజారిటీ లీడర్‌ మిచ్‌ మెక్‌ కానెల్‌ పేర్కొన్నారు. సెనెట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే కనీసం 17 మంది రిపబ్లికన్‌ సభ్యులు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుంది.  అభిశంసన తీర్మానంపై ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ ఎంపీలైన అమీ బెరా, ఆర్‌ఓ ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు