అమెరికా ఎగుమతుల మండలిలో ఇద్దరు భారతీయులు

2 Mar, 2023 06:09 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ విభాగంలో మరో ఇద్దరు భారతీయ  అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి ప్రధాన జాతీయ సలహా మండలి ఎక్స్‌పోర్ట్‌ కౌన్సిల్‌కు కార్పోరేట్‌ రంగానికి చెందిన పునీత్‌ రంజన్, రాజేశ్‌ సుబ్రమణియమ్‌లను ఎన్నుకున్నట్లు వైట్‌హౌస్‌ బుధవారం ప్రకటించింది.     రంజన్‌ గతంలో డెలాయిట్‌ కన్సల్టింగ్‌కు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈఓ ఎమిరిటస్‌గా ఉన్నారు.

ఫెడ్‌ఎక్స్‌కు సీఈవో, అధ్యక్షునిగా సుబ్రమణియమ్‌ కొనసాగుతున్నారు. సుబ్రమణియమ్‌ను ఈ ఏడాది భారతప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌తో సత్కరించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యం పనితీరు, ఎగుమతులను ప్రోత్సహించడం, వ్యాపార, పరిశ్రమల, వ్యవసాయ, కార్మిక, ప్రభుత్వ విభాగాల మధ్య తలెత్తే సమస్యలపై చర్చించి ఈ ఎగుమతుల మండలి పరిష్కారానికి కృషిచేస్తుంది. ఈ అంశాలపై అధ్యక్షుడు బైడెన్‌కు సలహాలు, సూచనలు చేస్తోంది.

మరిన్ని వార్తలు