ట్రంప్ రికార్డు బ్రేక్ చేసిన బైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు చోటు

24 Aug, 2022 17:04 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. అమెరికా జనాభాలో దాదాపు ఒక్క శాతం ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే భారత సంతతి వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు బైడెన్. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో 80 మంది భారత సంతతి వ్యక్తులు  ఉండేవారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంఖ్య 60గా ఉంది. బైడెన్ మాత్రం గత ప్రభుత్వాలతో పోల్చితే రికార్డు స్థాయిలో 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. దీంతో శ్వేతసౌధంలో ఏ సమావేశం జరిగినా అందులో తప్పనిసరిగా భారత సంతతి వ్యక్తులుంటారు. వీరు లేకుండా సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.

అంతేకాదు ప్రతినిధుల సభలో  నలుగురు సభ్యులు సహా మొత్తం  40 మంది భారత సంతతి వ్యక్తులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అమెరికాలోని 20 టాప్ కంపెనీలకు కూడా సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులే ఉండటం గమనార్హం.

బైడెన్ పాలనాయంత్రాంగంలో ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో ఆయన స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి, కోవిడ్-19 ముఖ్య సలహాదారు డా.ఆశిష్ రెడ్డి, క్లైమేట్ పాలసీ సలహాదారు సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ ప్రత్యేక సలహాదారు చిరాగ్‌ బైన్స్, పర్సనల్ మేనెజ్‌మెంట్ ఆఫీస్ హెడ్‌ కిరణ్ అహుజా, సీనియర్ అడ్వైజర్‌ నీర టాండెన్, డ్రగ్ కంట్రోల్ పాలసీ అడ్వైజర్ రాహుల్ గుప్తా వంటి వారు ఉన్నారు.
చదవండి: ఉక్రెయిన్‌కి ఇది పునర్జన్మ! ఇక రాజీపడేదే లే!: జెలనెన్‌ స్కీ

>
మరిన్ని వార్తలు