జో బైడెన్‌కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ

21 Jul, 2022 16:50 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్‌ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది.

మసాచుసెట్స్‌లోని సోమర్‌సెట్లో పాత బొగ్గ గని ప్లాంట్‌ను సందర్శించేందుకు బుధవారం వెళ్లారు బైడెన్‌. వాతావరణ మార్పులపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం జారీ చేసిన నూతన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వెలువడే ఉద్గారాల వల్ల ఎంత హాని జరుగుతుందో వివరించారు.

చిన్నప్పుడు తల్లి తమను కారులో తీసుకెళ్లేదని, ఆ సమయంలో పరిశ్రమలనుంచి వెలువడే ఉద్గారాలు కారు లోపలికి రాకుండా విండ్‌షీల్డ్‌ వైపర్స్‌ ఎప్పుడూ ఆన్ చేసి ఉండేవని వివరించారు. ఈ పరిస్థితి వల్ల డెలావేర్‌లో తనతో పాటు పెరిగిన చాలా మంది క్యాన్సర్ బారినపడ్డారని వెల్లడించారు. క్యాన్సర్ రేటు డెలావేర్‌లోనే అత్యధికంగా ఉందని గుర్తు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాసేపట్లోనే వైరల్ అయింది. బైడెన్‌కు క్యాన్సరా? ఆయనకు నయం కావాలని కోరుకుంటున్నాం అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో శ్వేతసౌధం దీనిపై క్లారిటీ ఇచ్చింది. బైడెన్‌కు ప్రస్తుతం క్యాన్సర్‌ లేదని చెప్పింది. అధ్యక్షుడు కావడానికి ముందే ఆయన చర్మ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నట్లు తెలిపింది.
చదవండి: దొంగలముఠాను కత్తితో హడలెత్తించిన వ్యక్తి.. దెబ్బకు తోకముడిచిన గ్యాంగ్‌.. గన్‌ లైసెన్స్‌పై డిబేట్!

మరిన్ని వార్తలు