బైడెన్‌–జిన్‌పింగ్‌ భేటీకి రంగం సిద్ధం

13 Nov, 2021 05:24 IST|Sakshi

సోమవారం ఇరువురి నడుమ వర్చువల్‌ సమావేశం  

వాషింగ్టన్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్‌పింగ్‌ భేటీకి రంగం సిద్ధమయ్యింది. వారిద్దరూ సోమవారం సాయంత్రం వర్చువల్‌గా సమావేశం కానున్నారు. వీడియో కాల్‌ ద్వారా ఇరువురు నేతలు మాట్లాడుకోనున్నారు. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు క్షీణించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బైడెన్, జిన్‌పింగ్‌ సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఈ భేటీ ద్వారా పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదని వైట్‌హౌస్‌ అధికార వర్గాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. అమెరికా, చైనా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కలిసి పనిచేసే దిశగా బైడెన్, జిన్‌పింగ్‌ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు. అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను బైడెన్‌ చైనా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఇరువురు నేతలు మాట్లాడుకుంటుండడం ఇది మూడోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చైనా వెల్లడించింది. 

మరిన్ని వార్తలు