బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన

24 Jun, 2022 10:15 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. న్యూయార్క్‌ పౌరులు తుపాకుల్ని తమ వెంట తీసుకెళ్లేందుకు(బహిరంగ ప్రదేశాల్లో కూడా) మార్గం సుగమం చేస్తూ.. గురువారం ఆదేశాలు జారీ చేసింది అమెరికా అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో.. సుప్రీం ఆదేశాలపై తీవ్ర నిరాశ చెందినట్లు అధ్యక్షుడు బైడెన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి, ఇంగిత జ్ఞానానికి (కామన్‌సెన్స్‌) విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు అమెరికన్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేది అని వ్యాఖ్యానించారయన. అయితే తీర్పు ఎలా ఉన్నా.. రాష్ట్రాలు మాత్రం తమ తమ పరిధిలో తుపాకీ నియంత్రణ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, తద్వారా కాల్పుల నేరాలకు కట్టడి వేయాలని కోరారు ఆయన.  

న్యూయార్క్‌లో పౌరులు తుపాకీ వెంట తీసుకెళ్లే హక్కులపై ఆంక్షలు విధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే.. ఆ చట్టాన్ని కొట్టేస్తూ గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. అమెరికన్లకు తుపాకీలను మోసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉంటుందని ప్రభుత్వానికి గుర్తు చేసింది సుప్రీం కోర్టు.  

న్యూయార్క్‌ చట్టం ప్రకారం.. సాధారణ పౌరులు తుపాకులను మోసుకెళ్లే వాళ్లు.. సరైన కారణం, వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రత్యేక అవసరమా? లేదంటే ఆత్మ రక్షణ అన్న విషయం మీద కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. బైడెన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగలడంతో నేషనల్‌ రైఫిల్‌ అసోషియేషన్‌ సంబురాలు చేసుకుంటోంది. 2020 లెక్కల ప్రకారం.. అమెరికా పౌరుల దగ్గర 390 మిలియన్ల తుపాకులు ఉన్నాయి. సుమారు 45 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 

Gun Safety Billకు ఆమోదం
ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలినా బైడెన్‌ సర్కార్‌ మాత్రం గన్‌ వయలెన్స్‌ కట్టడికి ఓ ముందడుగు వేసింది. గురువారం రాత్రి ద్వైపాక్షిక గన్‌ సేఫ్టీ బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికా సెనేట్‌. అమెరికాలో పేట్రేగిపోతున్న తుపాకీ హింస నేపథ్యంలోనే.. కట్టడి దిశగా ఈ బిల్లు తీసుకొచ్చింది బైడెన్‌ ప్రభుత్వం.  గత మూడు దశాబ్దాల తర్వాత తుపాకీ హింస కట్టడికి.. ఇదే అతిపెద్ద సంస్కరణ కావడం విశేషం. ప్రస్తుతం ఈ బిల్లు.. ఓటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. వీలైనంత త్వరగా శుక్రవారం లోపే ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు