Joe Biden: బూస్టర్‌ డోస్‌ తీసుకున్న బైడెన్‌

28 Sep, 2021 15:30 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోవిడ్‌-19 బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు, 65 ఏళ్లు పైబడిన అమెరికన్లందరు తప్పనిసరిగా ఫైజర్‌ మూడో డోసు తీసుకోవాల్సిందిగా కొన్ని రోజుల క్రితం అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది. ఈ క్రమంలో బైడెన్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. వైట్ హౌజ్‌లో ఆయన ఫైజర్ టీకా మూడో డోసు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి విముఖత చూపుతున్న ప్రజలు దేశానికి నష్టం కలిగిస్తున్నారని బైడెన్‌ విమర్శించారు.
(చదవండి: పరస్పరం గుర్తించాలి: వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ

మొదటి రెండు డోసులు తీసుకున్న తర్వాత తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని జో బైడెన్ తెలిపారు. అర్హత ఉన్న వారు బూస్టర్ డోస్ తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అమెరికాలో ఇప్పటివరకు కనీసం ఒక్కడోసు తీసుకున్న వారు 77 శాతంగా ఉన్నారన్నారు. మరో పావు శాతం మంది ప్రజలు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని.. ఇలాంటి వారి వల్లే దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోందని బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
(చదవండి: ఇజ్రాయెల్‌ ప్రధాని భేటీలో బైడెన్‌ కునికి పాట్లు!)

సీడీసీ నివేదిక ప్రకారం, ఆగస్టు మధ్య నుంచి ఇప్పటివరకు కనీసం 2.66 మిలియన్ల మంది అమెరికన్లు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను తీసుకున్నారు. దాదాపు 100 మిలియన్ల మంది అమెరికన్లకు ఫైజర్‌ టీకాలు వేశారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసులు వేయించుకోవాలని అమెరికా అధికారులు సూచించారు. ఇక అమెరికాలో బూస్టర్‌ డోసులు ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓ వైపు పేద దేశాలు కనీసం ఒక్క డోసు టీకా కూడా అందక ఇబ్బంది పడుతుంటే.. మీరు మూడో డోస్‌ వేసుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.  

చదవండి: వలసదారుల ఇక్కట్లు.. బైడెన్‌ ప్రభుత్వ కీలక ప్రకటన

>
మరిన్ని వార్తలు