కీలక పరిణామం..ఉక్రెయిన్‌ రాజధానికి అమెరికా అధ్యక్షుడు..!

3 May, 2022 04:45 IST|Sakshi

త్వరలో పర్యటిస్తారంటూ వార్తలు 

రొమేనియాకు ఆయన భార్య జిల్‌ 

ఉక్రెయిన్‌ శరణార్థ బాలలకు పరామర్శ 

కొనసాగుతున్న రష్యా దాడులు 

కీవ్‌: ఉక్రెయిన్‌కు సంఘీభావ సూచకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలో ఆ దేశ రాజధాని కీవ్‌లో పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య జిల్‌ బైడెన్‌ మే 5 నుంచి 9 దాకా రొమేనియా, స్లొవేకియాల్లో పర్యటిస్తారని ఆమె కార్యాలయం ప్రకటించింది. అక్కడ తల దాచుకుంటున్న ఉక్రెయిన్‌ బాలలను పరామర్శిస్తారని తెలిపింది. కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మే చివరికల్లా పునఃప్రారంభించనున్నట్టు అమెరికా ప్రకటించింది.

డెన్మార్క్‌ ఇప్పటికే తన రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభించింది. మరోవైపు మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంటు నుంచి పౌరుల తరలింపు మొదలైంది. 100 మందికి పైగా వృద్ధ మహిళలు, పిల్లల తల్లులు ప్లాంటు నుంచి బయటికొచ్చి బస్సులెక్కుతున్న వీడియోలను ఉక్రెయిన్‌ విడుదల చేసింది. వీరిలో సగం మంది దాకా రష్యా నియంత్రణలోని డోన్బాస్‌కు వెళ్తామని చెప్పారని ఆ దేశ సైన్యం పేర్కొంది. అయితే 50 లక్షల మంది ఉక్రేనియన్లను రష్యా ఇప్పటిదాకా నిర్బంధించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆ రోపించారు. తమనూ అలాగే తరలిస్తారనే భ యంతో అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చేందుకు పౌరులు భయపడుతున్నారన్నారు.

రష్యాకు నాలుగో వంతు నష్టం 
ఒడెసాకు పశ్చిమాన ఒక బ్రిడ్జిని రష్యా కూల్చేసింది. తూర్పు ఉక్రెయిన్లో పలు ఆయుధాగారాలతో పాటు డజన్ల కొద్దీ టార్గెట్లపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఒక మిగ్‌ 29 ఫైటర్‌ జెట్‌ను కూడా కూల్చేసినట్టు చెప్పింది. ఈ దాడుల్లో పలువురు పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ ఆరోపించింది. నల్లసముద్రంలో గస్తీ కాస్తున్న రెండు రష్యా రాప్టర్‌ బోట్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. అయితే ఉక్రెయిన్‌లో మోహరించిన రష్యా సైనిక రెజిమెంట్లలో ఏకంగా నాలుగో వంతు యుద్ధ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు ఇంగ్లండ్‌ అంచనా వేసింది. సైనికులను, ఆయుధాలను భారీగా నష్టపోయి వీడీవీ వంటి అత్యాధునిక రష్యా దళాలు కూడా కోలుకోలేని నష్టాలు చవిచూశాయని చెప్పింది. ఈ నష్టాల భర్తీకి రష్యాకు చాలా ఏళ్లు పడుతుందని అభిప్రాయపడింది. రష్యా ప్రభుత్వ అణు ఇంధన కార్పొరేసన్‌ రుస్తోమ్‌తో 1,200 మెగావాట్ల అణు విద్యుత్కేంద్రం ఏర్పాటు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఫిన్లండ్‌కు చెందిన అణు ఇంధన కంపెనీ ప్రకటించింది. మరోవైపు రష్యా ఇంధన సరఫరాలు ఆగిపోయినా నెట్టుకురాగలమని జర్మనీ ధీమా వెలిబుచ్చింది. వాటినిప్పటికే 12 శాతానికి తగ్గించుకున్నామని పేర్కొంది. గ్యాస్‌ సరఫరాలను తగ్గించాలన్న రష్యా నిర్ణయంపై యూరప్‌ దేశాల ఇంధన మంత్రులు సమావేశమై చర్చించారు. 

హిట్లర్‌–యూదు వ్యాఖ్యల కలకలం 
హిట్లర్‌లోనూ యూదు మూలాలు ఉన్నాయంటూ రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని హిట్లర్‌తో పోలుస్తూ ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జెలెన్‌స్కీ ఓ యూదు కావచ్చు. కానీ ఉక్రెయిన్‌ను నాజీయిజంతో నింపేశారు. దాన్ని పెకిలించడమే రష్యా లక్ష్యం’’ అని ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో లావ్రోవ్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా మండిపడింది. రష్యా రాయబారిని పిలిపించి వివరణ కోరింది.  


ఇంగ్లండ్‌ జలసమాధే
రష్యా ప్రధాన ప్రచారకర్త కిసెల్యోవ్‌ 

ఇంగ్లండ్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని రష్యా ప్రధాన ప్రచారకర్త ద్మిత్రీ కిసెల్యోవ్‌ హెచ్చరించారు. ‘‘రష్యాపై అణు దాడి చేస్తామని ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బెదిరిస్తున్నారు. ఇంగ్లండ్‌పై మేం అణు వార్‌హెడ్‌తో కూడిన పోసిడోన్‌ టోర్పెడోను ప్రయోగిస్తాం. దాని దెబ్బకు రేడియో ధార్మికతతో కూడిన అలలు 1,600 అడుగుల ఎత్తున ఎగసిపడి ఇంగ్లండ్‌ను సమూలంగా, శాశ్వతంగా సముద్రగర్భంలో కలిపేస్తాయి’’ అంటూ ఒక టీవీ షోలో బెదిరించారాయన. ‘‘100 మెగాటన్నుల వార్‌హెడ్‌ సామర్థ్యం పోసిడోన్‌ సొంతం. హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే కొన్ని వేల రెట్లు శక్తిమంతమైనది. దాని దెబ్బకు ఇంగ్లండ్‌ ప్రపంచ పటంలోనే లేకుండా పోతుంది. రాకాసి అలలతో పాటు వచ్చి పడే రేడియో ధార్మికత ఆ దేశాన్ని రేడియో ధార్మిక ఎడారిగా మార్చేస్తుంది. ఇదెలా ఉంది? లేదంటే రష్యా తాజాగా పరీక్షించిన సర్మాట్‌ 2 న్యూక్లియర్‌ మిసైల్‌ను ప్రయోగిస్తాం. ఒక్క దెబ్బకు భస్మీపటలమైపోతుంది. అంత చిన్నది మీ దేశం’’ అంటూ ఎద్దేవా చేశారు. అణు దాడులు తప్పవంటూ రష్యా ప్రభుత్వ మీడియా కొంతకాలంగా ఇంగ్లండ్‌ను హెచ్చరిస్తూ వస్తోంది. కిసెల్యోవ్‌ వ్యాఖ్యలు వాటికి కొనసాగింపేనంటున్నారు.   

మరిన్ని వార్తలు